కాపుల ఆకలి తీర్చడానికే ఆమరణ దీక్ష

Update: 2016-02-08 10:04 GMT
 కాపుల రిజర్వేషన్ల కోసం దీక్ష చేపట్టి నాలుగు రోజుల అనంతరం ప్రభుత్వం చర్చలు జరిపి తగిన హామీలు ఇవ్వడంతో దీక్ష విరమించిన ముద్రగడ తన దీక్ష ఉద్దేశాలను ప్రజలకు వివరించారు. కాపు జాతి ఆకలి తీర్చేందుకే తాను ఆమరణ దీక్ష చేపట్టానని ఆయన తెలిపారు. దీక్ష విరమించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపు రిజర్వేషన్లపై గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకే తాను ఉద్యమం చేశానని తెలిపారు. జాతి సంక్షేమం కోసం దీక్ష విరమించినట్లు చెప్పారు. సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ దీక్ష చేశాను తప్ప ప్రభుత్వాన్ని అవమానించాలన్న ఆలోచన లేదన్నారు. తక్కువ ఆదాయం ఉన్న కాపులకు రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతున్నట్లు చెప్పారు. బీసీలకు అన్యాయం జరగాలని తాను కోరుకోవడం లేదని అన్నారు. దీక్షకు సహకరించిన వారందరికీ ముద్రగడ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు ముద్రగడతో దీక్ష విరమింపజేసిన అచ్చెన్నాయుడు కూడా ముద్రగడ దీక్ష విరమణపై సంతోషం వ్యక్తంచేశారు. చర్చలు సఫలం కావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.  కాపు రిజర్వేషన్లపై మొదటి నుంచీ చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని.. ఏ వర్గానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.  ఏడు నెలల్లో మంజునాథ నివేదిక సమర్పిస్తామని అన్నారు. కాపులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కమిషన్‌ వేసిందని తెలిపారు. అన్ని వర్గాలకు సంతృప్తి కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు.
Tags:    

Similar News