ముద్రగడను అరెస్ట్ చేస్తారా? చేయరా?

Update: 2016-02-11 07:29 GMT
కాపు గర్జన సందర్భంగా రైల్వే - ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను అరెస్టు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. ముద్రగడను అరెస్టు చేస్తే, రాజకీయ ఇబ్బందులు తప్పవని భావిస్తున్న ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించే ధోరణితో ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తుని ఘటనకు ముద్రగడే బాధ్యత వహించాలని మరొక వైపు బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముద్రగడ రెచ్చగొట్టడం వల్లే కాపు మహా గర్జనకు హాజరయిన కార్యకర్తలు రత్నాచల్ ఎక్స్‌ ప్రెస్‌ కు నిప్పుపెట్టడమే కాకుండా, తుని రూరల్ పోలీసు స్టేషన్ ఆవరణలో నిలిపి ఉన్న వాహనాలను తగులబెట్టారంటున్నారు.

సాధారణంగా ఎవరిపైనైనా ఒక చిన్న కేసు నమోదు చేస్తే చాలు, అతన్ని వెంటనే అరెస్టు చేస్తారు. నిందితుడు గనుక అందు బాటులో లేకపోతే అతని కుటుంబ సభ్యులను తీసుకువచ్చి స్టేషన్‌ లో కూర్చోబెడుతుంటారు. అలాంటిది 61 కేసులలో ఎ 1 నిందితుడుగా ముద్రగడ పేరు రాసినా... ఆయన్ను ఎందుకు అరెస్టు చేయడం లేదని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.  చట్టం ముందు అందరూ సమానులేనని చెప్పే పాలకులు - ముద్రగడ విషయంలో ఎందుకు మినహాయింపునిస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ముద్రగడను అరెస్టు చేయడమంటే కొరివితో తల గోక్కోవడం వంటిదేనని ప్రభుత్వవర్గాలు అంటున్నాయి. ముద్రగడను అరెస్టు చేస్తే కాపులంతా  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన లకు దిగే అవకాశాలు లేకపోలేదన్నది వారి భావన.  దీంతో ఇంత పెద్ద ఘటనలోనూ ప్రభుత్వం కేసులు పెట్టడం తప్ప ఏ1 ముద్దాయిని అరెస్టు చేయకపోవడంతో ప్రభుత్వం ఎంత భయంతో ఉందో అర్థమవుతోందన్న వాదన వినిపిస్తోంది.
Tags:    

Similar News