రాజ్యసభలో మోడీ మార్క్ ఎదురుదాడి వ్యూహం

Update: 2015-07-22 04:41 GMT
వరుస ఆరోపణలు.. కుంభకోణాలు.. విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఎన్డీయే సర్కారు.. తాజాగా మొదలైన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తనదైన శైలిలో స్పందించింది. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు.. దూకుడు రాజకీయాల్ని ప్రదర్శించింది. తన మీద పడిన మరకల్ని ఎత్తి చూపిన విపక్షాలకు.. వారి తప్పుల్ని చూపించే ప్రయత్నం చేసింది.

ఢిల్లీ యవ్వారాల్ని మన గల్లీ వ్యవహారాలతో పోలిక తీసుకొస్తే మంగళవారం.. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన ఎదురుదాడి మాదిరే మోడీ సర్కారు వైఖరి రాజ్యసభలో కనిపించింది. టీడీపీ తరఫున ఎంపికైన తలసాని.. టీఆర్ ఎస్ సర్కారులో మంత్రి పదవిని ఏ విధంగా చేపడతారన్న విపక్షాల ప్రశ్నకు.. విపక్షాలు అధికారంలో ఉన్న సమయంలో అనుసరించిన విధానాల్ని గుర్తు చేసి ఎదురుదాడి చేసిన తీరులోనే.. ఎన్డీయే సర్కారు.. రాజ్యసభలో వ్యవమరించింది.

బీజేపీ అధికారంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లోని ఆరోపణలపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తే.. రాష్ట్రాల వ్యవహారాలు పార్లమెంటులో చర్చించే సంప్రదాయం లేదని.. ఒకవేళ అలానే చేద్దామంటే.. కాంగ్రస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ఆరోపణలపై కూడా చర్చ జరుపుదామా? అంటూ రివర్స్ గేర్ లో తమ వాదన వినిపించారు.

తలసాని వ్యాఖ్యల్ని అడ్డగోలు వాదనగా తిట్టిపోసే వారు.. కేంద్రంలో కొలువు దీరిన ఎన్డీయే సర్కారు కూడా తలసాని మాదిరే వ్యవహరించటం గమనార్హం. ఏతావాతా తేలేదేమంటే.. ఢిల్లీ అయినా.. గల్లీలో అయినా.. తాము చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తే.. దానికి వివరణ ఇచ్చే కన్నా.. ఎత్తి చూపించినోడి తప్పుల గురించి నిలదీసే ధోరణి కనిపించక మానదు. చూస్తుంటే.. ఢిల్లీలోనూ.. గల్లీలోనూ రాజకీయాలు సేమ్ టు సేమ్ అని చెప్పక తప్పదు.
Tags:    

Similar News