హుజూరాబాద్ దెబ్బకు ఎంఎల్సీ ఎన్నికలు వాయిదా ?

Update: 2021-08-01 16:30 GMT
తొందరలో జరగబోయే హుజూరాబాద్ ఎన్నికంటే కేసీయార్ భయపడుతున్నారా ? తాజాగా ప్రభుత్వంలో జరిగిన ఓ పరిణామంతో అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. శాసనసభ కోటాలో భర్తీ చేయాల్సిన ఆరు ఎంఎల్సీ స్ధానాల ఎన్నికలకు ఇది అనువైన సమయం కాదని ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమీషన్ కు లేఖ రాయటమే విచిత్రంగా ఉంది. ఎంఎల్ఏ కోటాలో ఎన్నికైన 6 ఎంఎల్సీల కాలపరిమితి మొన్నటి జూన్ 3వ తేదీతో అయిపోయింది.

అప్పటి నుండి ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ ఎప్పుడు జారీచేస్తుందా తామెప్పుడు ఎంఎల్సీలుగా ఎన్నికవుతామా ? అని చాలామంది నేతలు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఎన్నికల కమీషన్ కు రాసిన లేఖతో చాలామంది నిరాసలో కూరుకుపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రతను కారణంగా చూపించి ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం లేఖ రాసింది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వివిధ సందర్భాల్లో ఎంఎల్సీలుగా చాలామందికి కేసీయార్ హామీ ఇచ్చేశారు. అవేవి జరిగేపనికాదని అందరికీ తెలుసు. విశ్వబ్రాహ్మణులు, కుమ్మరి, రజక, పద్మశాలి నేతలకు ఎంఎల్సీ హామీ ఇచ్చారు. అలాగే, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల సమయంలో స్ధానిక నేత కోటిరెడ్డికి కూడా బహిరంగంగానే హామీ ఇచ్చారు. వీళ్ళు కాకుండా మరో పదిమందికి ఎంఎల్సీలుగా అవకాశం ఇస్తానని కేసీయార్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

పైన చెప్పిన సామాజికవర్గాలన్నీ బీసీల్లో ఉపకులాలే. ఇపుడు గనుక పై సామాజికవర్గాలకు ఎంఎల్సీ పదవులను ఇవ్వకపోతే హుజూరాబాద్ ఉపఎన్నికపై ప్రభావం చూపుతుంది. అలాగే ఎస్సీని ఎంపిక చేయకపోతే దాని ప్రభావం కూడా ఉపఎన్నికపై పడటం ఖాయం. రెడ్లకు ఇస్తానని బహిరంగంగా ప్రకటించి మాట తప్పితే దాని ప్రభావం కూడా హుజూరాబాద్ లో పడుతుంది. ఎందుకంటే హుజూరాబాద్ లో బీసీ, ఎస్సీల ఓట్లే సుమారుగా 1.5 లక్షలున్నాయి.

సో ఈ విషయాలన్నింటినీ ఆలోచించుకునే బీసీ, ఎస్సీ, రెడ్డి సామాజికవర్గాలను దూరం చేసుకోవటం ఇష్టంలేకే ఏకంగా ఎన్నికలనే వాయిదా కోరారు. నిజానికి ఎంఎల్ఏ కోటాలో భర్తీ చేయాల్సిన ఎంఎల్సీ ఎన్నికకు కరోనా వైరస్ పెద్ద అడ్డించి కానేకాదు. భారీ ఎత్తున ఒకవైపు బహిరంగసభలే నిర్వహిస్తున్న కేసీయార్ మరోవైపు ఎంఎల్సీ ఎన్నికకు కరోనా వైరస్ ను కారణంగా చూపటమే పెద్ద జోక్ అని చెప్పాలి. అసలు విషయం ఏమిటంటే హుజూరాబాద్ ఉపఎన్నికే అని టీఆర్ఎస్ వర్గాలే ఆఫ్ ది రికార్డుగా చెప్పుకుంటున్నాయి.
Tags:    

Similar News