ఎమ్మెల్యేను అవమానించిన మంత్రి?

Update: 2019-10-12 07:12 GMT
గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ తో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. తనను కలవడానికి వచ్చిన పలువురు నేతలతో ఆప్యాయంగా వ్యవహరించిన అనిల్ కుమార్ యాదవ్ - గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ తో మాత్రం అంటీముట్టనట్టుగా వ్యవహరించారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఫొటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

తనను కలవడానికి వచ్చిన వారిలో కొందరిని పక్కనే కూర్చోబెట్టుకున్న అనిల్ కుమార్ యాదవ్ - వరప్రసాద్ ను మాత్రం దూరం పెట్టారని సమాచారం. పెద్ద హోదా లేని నేతలను పక్కన కూర్చోబెట్టుకున్న ఆయన వరప్రసాద్ కు మాత్రం పక్కన చోటిచ్చినట్టుగా లేరని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

వరప్రసాద్ ఒకసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా నెగ్గారు. మిగతా ఎంపీలు కొందరు అమ్ముడు పోయినా వరప్రసాద్ గట్టిగా నిలబడ్డారు. ఆ తర్వాత పార్టీ అవసరం మేరకు ఆయన ఎంపీ టికెట్ ను వదులుకున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా విజయం సాధించారు.

అలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో గౌరవనీయమైన స్థానంలో ఉన్నారాయన. ఇలాంటి నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ అలాంటి సీనియర్ ను పక్కనే ఆశీనులను చేసి గౌరవించాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే సీనియర్ రాజకీయ నేతలను పెద్దగా గౌరవించరనే పేరున్న మంత్రి ఆ వరప్రసాద్ ను కూడా పెద్దగా పట్టించుకున్నట్టుగా లేరనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News