జగన్ లో మరీ ఇంత రాక్షసత్వం ఉందా?

Update: 2015-10-29 08:04 GMT
రాజకీయంగా విమర్శలు కొత్తేం కాదు. కానీ.. ఈ విమర్శలు తీవ్రతరం కావటం.. వ్యక్తిగతాన్ని దెబ్బ తీసేలా.. హుందతానికి దూరంగా ఉండేలా మాట్లాడటం ఒక అలవాటుగా మారింది. ఎవరు ఎంత బాగా తిడితే అంతగా మీడియాలో ప్రాధాన్యత లభించటం కూడా ఒక కారణం కావొచ్చు. అంతేకాదు.. తమ రాజకీయ ప్రత్యర్థుల కంటే ఒక అడుగు ముందుండాలన్న తపన కూడా నేతల నోట మాటల్ని హద్దులు దాటించేలా చేస్తుందని చెప్పక తప్పదు. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తాజాగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శలే దీనికి నిదర్శనం. రాజధాని అమరావతికి విషయంలో రైతుల పట్ల రాక్షసంగా వ్యవహరిస్తున్నారంటూ చంద్రబాబుపై జగన్ ఫైర్ అయిన నేపథ్యంలో.. తమ్ముళ్లు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.

జగన్ ఎంత రాక్షసంగా వ్యవహరిస్తారన్న విషయాన్ని చెప్పేందుకు పలు ఉదాహరణల్ని ప్రస్తావిస్తూ పెద్ద లిస్టే చదువుతున్నారు. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి మల్లెల లింగారెడ్డి మాట్లాడుతూ.. జగన్ ఎంత రాక్షసంగా వ్యవహరిస్తారన్న విషయాన్ని పలు ఉదాహరణలతో చెప్పే ప్రయత్నం చేశారు.

చంద్రబాబు పాదయాత్ర చేసిన సమయంలో ఆయనకు పోటీగా సోదరి షర్మిల చేత పాదయాత్ర చేయించటం ద్వారా రాక్షసంగా వ్యవహరించారని లింగారెడ్డి ఆరోపించారు. ఎన్ని సందర్భాల్లో జగన్ ఎంత రాక్షసంగా వ్యవహరించారో చెబుతూ.. ‘‘తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి కోసం రాజకీయం చేయటం రాక్షసం కాదా? తల్లి విజయమ్మను విశాఖలో పోటీ చేయించటం రాక్షసం కాదా? జగన్ బాబాయ్ ఎంపీ సీటును ఖాళీ చేయించటానికి ఎంత రాక్షసంగా ప్రయత్నించారు. సోనియాగాంధీకి జగన్ వెన్నుపోటు పొడవటమే కాదు.. రాజధానికి అడ్డుపడటం కూడా రాక్షసత్వమే’’ అంటూ జగన్ లోని రాక్షసత్వ కోణాన్ని ఆవిష్కరించేందుకు విపరీతంగా శ్రమించారు. ఏపీ అధికార.. విపక్షాల మధ్య నడుస్తున్న ‘‘రాక్షస’’ విమర్శలు ఎక్కడి వరకూ వెళతాయో..?
Tags:    

Similar News