మలాలా తాజా వ్యాసాన్ని చదివిరా? తాలిబన్ల విధ్వంసం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది

Update: 2021-08-26 07:31 GMT
ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు.. మలాలా. కొన్నేళ్ల క్రితం పాకిస్థానీ తాలిబన్ ఒకరు స్కూల్ బస్సులోకి ప్రవేశించి.. విచక్షణరహితంగా కాల్పులు జరపటం.. అందులో స్కూల్ విద్యార్థినిగా ఉన్న మలాలా తాలిబన్ తూటాకు తీవ్రంగా గాయపడటం తెలిసిందే. అనంతరం ఆమెపై జరిగిన దాడికి ప్రపంచమంతా ఖండించటం.. తర్వాతి రోజుల్లో ఆమె ప్రముఖురాలిగా మారటం తెలిసిందే. ఈ టీనేజర్ తాజాగా రాసిన వ్యాసం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇందులో తాలిబన్ల ఆరాచకం ఎంతలా ఉంటుందన్న విషయంతో పాటు.. వారి కారణంగా ఎంతలా ఇబ్బంది పడతారన్న విషయాన్ని వివరంగా వెల్లడిస్తుంది.అందుకు తన జీవితంలోని ఉదంతాల్నే ఆమె ఉదాహరణగా చెప్పుకొచ్చారు.

తాజాగా ఆమె రాసిన వ్యాసంలోని కొన్ని ముఖ్యాంశాల్ని చూస్తే..

- రెండు వారాల క్రితం.. అమెరికా సేనలు అఫ్ఘానిస్థాన్‌ నుంచి ఉపసంహరించుకుంటున్న వేళ, తాలిబాన్లు తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్న వేళ.. నేను బోస్టన్‌లోని ఒక ఆస్పత్రి బెడ్‌పై ఉన్నాను. తాలిబాన్లు నా శరీరానికి చేసిన నష్టాన్ని పూడ్చడానికి వైద్యులు నాకు ఆరో సర్జరీ చేస్తున్నారు. 2012 అక్టోబరులో.. ఒక పాకిస్థానీ తాలిబాన్‌ మా స్కూలు బస్సులోకి ప్రవేశించి నా ఎడమ కణత భాగంలోకి తుపాకీ గురిపెట్టి కాల్చాడు.

- తూటా నా కంటిని, పుర్రె భాగాన్ని చీల్చుకుంటూ మెదడులోకి దూసుకెళ్లింది. ఆ తాకిడికి నా ముఖంపై ఉన్న నాడులు తీవ్రంగా గాయపడ్డాయి. నా కర్ణభేరి పగిలిపోయింది. దవడ ఎముకలు విరిగిపోయాయి. పాకిస్థాన్ లోని పెషావర్ వైద్యులు అత్యవసర చికిత్సలో భాగంగా నా ఎడమ కణత భాగంలో ఉన్న పుర్రె ఎముకను తొలగించారు. తూటా గాయమైన రోజు నుంచి యూకేలోని క్వీన్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రిలో మెలకువ వచ్చేదాకా.. జరిగినవేవీ నాకు గుర్తులేవు.

- నేను కళ్లు తెరిచి చూసి.. ప్రాణాలతో ఉన్నందుకు సంతోషించాను. నేను నా పొత్తికడుపు భాగాన్ని తడుముకుంటే.. అక్కడ గట్టిగా అనిపించింది. నర్సుల్ని అడిగితే.. పాకిస్థానీ వైద్యులు నా పుర్రెభాగాన్ని తొలగించి అక్కడ అమర్చారని, మరో సర్జరీ ద్వారా ఆ పుర్రె భాగాన్ని మళ్లీ తలలోనే అమరుస్తారని చెప్పారు. కానీ, ఆ తర్వాత యూకే వైద్యులు ఇన్ఫెక్షన్‌ ముప్పును నివారించేందుకు నా తల భాగంలో ఆ పుర్రె ఎముకకు బదులు టైటానియం ప్లేట్‌ బిగించారు.

- నా పొత్తికడుపులో ఉన్న పుర్రె ఎముకను బయటకు తీసేశారు. ఇప్పుడది నా పుస్తకాల అరలో ఒక గాజు పెట్టెలో భద్రంగా ఉంది. ఆరో సర్జరీ ఆగస్టు 9న బోస్టన్‌లో జరిగింది. ఆస్పత్రికి వెళ్లడం కోసం ఆ రోజు ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేచి చూస్తే.. తాలిబాన్లు కుందుజ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు వార్తల్లో చెబుతున్నారు. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్ల చేతికి చిక్కిన తొలి పెద్ద నగరం అది. ఆ తర్వాత అతి కొద్దిరోజుల్లోనే.. ఒకదానితర్వాత ఒకటిగా అఫ్ఘానిస్థాన్‌లోని ప్రావిన్సులను తుపాకులు ధరించిన వ్యక్తులు స్వాధీనం చేసుకోవడాన్ని.. నా తలకు బ్యాండేజీతో, ఐస్‌ప్యాక్‌లతో చూశాను.

- కూర్చునే ఓపిక రాగానే అనేక దేశాల అధిపతులకు ఫోన్‌కాల్స్‌ చేశాను. లేఖలు రాశాను. ఇంకా అఫ్ఘానిస్థాన్‌లో పనిచేస్తున్న మహిళా హక్కుల కార్యకర్తలతో మాట్లాడాను. గత రెండువారాల్లో మేం అఫ్ఘానిస్థాన్‌లోని చాలా మందికి సాయం చేశాం. వారి కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి సహకరించాం. కానీ.. మేం అందరినీ కాపాడలేమని నాకు తెలుసు. అఫ్ఘాన్ల గురించి తల్చుకుంటే నా హృదయం ముక్కలవుతోంది.
Tags:    

Similar News