మోడీ ద‌గ్గ‌రి మ‌నిషి అమెరికా తీరుపై హ‌ర్ట‌య్యాడు

Update: 2017-04-26 07:21 GMT
అగ్రరాజ్యం అమెరికా ఇటీవ‌లి కాలంలో తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కీల‌క స‌ల‌హాదారుల్లో ఒక‌రైన దేశ‌ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. హెచ్‌1బీ వీసాపై ట్రంప్‌ యంత్రాంగం తీసుకునే ఎలాంటి చర్యలైనా భారత్‌ కు ఆందోళన కలిగిస్తాయని ఆయ‌న అన్నారు. సేవల రంగంలో భారత్‌ నుంచి అమెరికాకు అత్యధిక ఎగుమతులు జరుగుతున్న క్రమంలో వీసా నిబంధనలు కఠినతరమైతే భారత్‌ కు ఇబ్బందికరమేనని అరవింద్‌ సుబ్రమణియన్ విశ్లేషించారు. అమెరికాలోని ప్రఖ్యాత పీటర్సన్‌ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అరవింద్‌ సుబ్రమణియన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌ నుంచి సేవల ఎగుమతుల్లో 50 నుంచి 60 శాతం వరకూ అమెరికా మార్కెట్‌ కే తరలుతున్న క్రమంలో వీసా నిబంధనలపై తీసుకునే నిర్ణయాలు మనపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అరవింద్‌ సుబ్రమణియన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వీసా సంస్కరణలు ఆమోదయోగ్యంగా ఉన్నంతవరకూ పరిస్థితిని ఎదుర్కోవచ్చని, అయితే కఠిన నిబంధనలను అమలుచేస్తే మాత్రం భారత్‌కు సమస్యలు తప్పవని చెప్పారు. అమెరికాకు సంబంధించినంత వరకూ హెచ్‌1బి వీసా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అరవింద్‌ సుబ్రమణియన్‌ చెప్పారు. వీసా నిబంధనలపై ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

హెచ్‌1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ,కేవలం అత్యుత్తమ నైపుణ్యాలు, అత్యధిక వేతనం కలిగిన ప్రొఫెషనల్స్‌కే హెచ్‌1బీ వీసాలను పరిమితం చేయాలనే కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్‌ ఇటీవల సంతకం చేసిన విషయం విదితమే. ఈ నిర్ణయం భారత ఐటీ పరిశ్రమను దెబ్బతీస్తుందని భావిస్తున్నారు.అమెరికాలో స్వల్పకాలిక ప్రాజెక్టులపై దేశీయ ఐటి ప్రొఫెషనల్స్‌ ఎక్కువగా ఈ వీసాలపై ఆధారపడుతున్నారని, తాజా నిబంధనలు వీరిపై ప్రభావం చూపుతాయని భారత ఐటీ పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. హెచ్‌1బీ వీసా అమెరికన్‌ కంపెనీలను సాంకేతిక నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలకు విదేశీ ప్రొఫెషనల్స్‌ను నియమించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. భారత ఐటీ కంపెనీలు తమ అమెరికా కార్యకలాపాల కోసం ఇదే వీసాను ఉపయోగించుకుని ఏటా వేలాది భారత నిపుణులను నియమించుకుంటున్నాయి. అమెరికన్‌ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్‌ లో దీటుగా ఎదిగేందుకు భారత్‌ అత్యంత నైపుణ్యాలతో కూడిన ఐటీ ప్రొఫెషనల్స్‌ను సమకూరుస్తోంది. అయితే అమెరికన్లకే ఉద్యోగాలనే నినాదంతో ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల్లో తలపడిన క్రమంలో భారత నిపుణులకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో హెచ్‌1బీ వీసా నిబంధనలను కఠినతరం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News