జ‌గ‌న్ ల‌క్ష్యంగా `మ‌హాకూట‌మి`.. మారుతున్న పాలిటిక్స్‌!!

Update: 2021-01-29 10:50 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా తెర‌చాటున భారీ వ్యూహం జ‌రుగుతోందా?  పైకి ఎవ‌రికి వారుగా ఉన్న‌ప్ప‌టికీ.. ప‌లు పార్టీలు చేతులు క‌లిపేందుకు వ్యూహాత్మ‌కంగా సిద్ధ‌మ‌వుతున్నాయా?  ఈ క్ర‌మంలో భేష‌జాల‌ను ప‌క్క‌న పెట్టి.. జ‌గ‌న్ ఓట‌మే ల‌క్ష్యంగా దూకుడుగా ముందుకు సాగుతున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

వాస్త‌వానికి గతంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విష‌యంలో కూడా ఇలానే పార్టీలు అన్నీ గంప‌గుత్త‌గా క‌లిసిపోయాయి. సిద్ధాంతాలను సైతం ప‌క్క‌న పెట్టి చేయి చేయి క‌లిపేశాయి. ఈ క్ర‌మంలో 2009లో ప్ర‌జారాజ్యం మిన‌హా.. అన్ని పార్టీలూ క‌లిసి మ‌హాకూట‌మిని ఏర్పాటు చేసి.. వైఎస్‌పై  పొలిటిక‌ల్ దండ‌యాత్ర చేశాయి.

ఇప్పుడు కూడా అదే త‌ర‌హాలో జ‌గ‌న్‌పై యుద్ధానికి సిద్ధ‌మ‌వుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో టీడీపీ, జ‌న‌సేన‌, క‌మ్యూనిస్టులు(సీపీఎం త‌ట‌స్థ‌వైఖ‌రితో ఉంది), బీజేపీ.. ఇత‌ర చిన్నా చిత‌కా పార్టీలు, సామాజిక వ‌ర్గాల‌ను ప్ర‌భావితం చేసే నాయ‌కులు కూడా ఒక్క‌ట‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.  

దీనికి అంకురార్ప ణ జ‌రుగుతోంద‌ని, నాయ‌కులు త‌ర‌చుగా చ‌ర్చించుకుంటున్నార‌ని.. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ కూడా సిద్ధ‌మ‌వుతుంద‌ని అంటున్నారు ఆయా పార్టీల సీనియ‌ర్లు.. ఆఫ్ దిరికార్డుగా!! మ‌రి ఇంత‌గా జ‌గ‌న్‌పై దండెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు రెండు క‌నిపిస్తున్నాయ‌ని వారు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడే క‌ళ్లు తెర‌వ‌క‌పోతే.. క‌ష్ట‌మేన‌ని అంటుండ‌డం మ‌రీ కీల‌క విష‌యంగా మారింది. ‌

1. ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన నేత‌గా జ‌గ‌న్‌: ప‌్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్‌.. బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎదుగుతున్నార‌నేది వాస్త‌వం. పార్టీ ప‌రంగా ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జ‌గ‌న్‌పై భారీ సింప‌తీ ఉంది. అదేస‌మ‌యంలో మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేసుకుని జ‌గ‌న్ అవలంబిస్తున్న విధానాలు, పెడుతున్న ప‌థ‌కా లు, సంక్షేమం వంటివి ఆయ‌న‌ను హీరోను చేస్తున్నాయి. జ‌గ‌న్ కూడా కోరుకున్న‌ది ఇదే!  రేపు ఏదైనా జ‌రిగి.. తాను జైలుకు వెళ్లినా.. త‌న ప్ర‌భ త‌గ్గ‌కుండా ప్లాన్ చేసుకుంటున్నారు. నాయ‌కులు ఎవ‌రు ఉన్నా.. త‌న‌ను చూసి ప్ర‌జ‌లు ఓటేసేలా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నారు. ఇది ఇత‌ర పార్టీల‌కు ప్రాణ‌సంక‌టంగా ప‌రిణ‌మించింది.

2. పార్టీల ఉనికి లేకుండా పోవ‌డం:  ఇత‌ర పార్టీలు చేతులు క‌లిపేందుకు ఇది మ‌రో కీల‌క ప‌రిణామంగా క‌నిపిస్తోంది. అన్ని పార్టీల్లోనూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిస్తేజ పూరిత ప‌రిణామం క‌నిపిస్తోంది. వైసీపీని వ్య‌తిరేకిస్తున్నా.. త‌మ పార్టీ ఎదుగుద‌ల‌కు మాత్రం నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేదు. దీనికి ఉన్న కార‌ణాలను పార్టీల అధినేతలు ప‌సిగ‌ట్ట‌లేక పోతున్నారు. గ‌తంలో వైఎస్ హ‌యాంలోనూ ఇలాంటి ప‌రిణామ‌మే ఎదురైంది. త‌మ వ్యాపారాలు కావొచ్చు. లేదా.. వ్య‌వ‌హారాలు కావొచ్చు. నాయ‌కులు పార్టీల్లోనే ఉన్నా.. కార్య‌క్ర‌మాల‌కు దూర‌మ‌య్యారు. ఇది తీవ్ర వ్య‌తిరేక‌త తెచ్చిపెట్టింది. దీంతో పార్టీల‌న్నీ ఏక‌మ‌య్యాయి. ఇప్పుడు కూడా ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని.. అందుకే పార్టీలు మ‌రోసారి మ‌హాకూటమి దిశ‌గా ఆలోచ‌న చేస్తున్నాయ‌ని అంటున్నారు. మ‌రి వీరి ఎత్తుగ‌డ ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.
Tags:    

Similar News