రోహిత్‌ శ‌ర్మ..రికార్డుల్లో అత‌డి పేరు కాదు..రికార్డే అత‌డి పేరు

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కేవ‌లం వ‌న్డే ఫార్మాట్ కే ప‌రిమితం అయినా.. అత‌డు ఎప్పుడు మైదానంలోకి దిగుతాడా? అని ఎదురుచూసే అభిమానులు ల‌క్ష‌ల్లో ఉన్నారు.;

Update: 2026-01-11 18:30 GMT

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కేవ‌లం వ‌న్డే ఫార్మాట్ కే ప‌రిమితం అయినా.. అత‌డు ఎప్పుడు మైదానంలోకి దిగుతాడా? అని ఎదురుచూసే అభిమానులు ల‌క్ష‌ల్లో ఉన్నారు. వారిని నిరాశ‌ప‌ర్చ‌కుండా రోహిత్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఆట‌తో అల‌రిస్తూనే ఉన్నాడు. తాజాగా న్యూజిలాండ్ తో మొద‌లైన మూడు వ‌న్డేల సిరీస్ లో మ‌రోసారి మురిపించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. త‌ద్వారా మ‌రో అరుదైన రికార్డును త‌న‌ ఖాతాలో వేసుకున్నాడు. 38 ఏళ్ల రోహిత్ గ‌త ఏడాది టెస్టుల‌కు, అంత‌కుముంద‌టి ఏడాది టి20ల‌కు వీడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. 2027 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ల‌క్ష్యంగా ఆడుతున్నాడు. ఫామ్ కు ఢోకా లేదు. ఫిట్ నెస్ బాగా మెరుగుప‌ర్చుకున్నాడు. దీంతో అత‌డిని 2027 ప్ర‌పంచ క‌ప్ లో చూస్తామ‌ని చాలామంది అభిమానులు ఆశ‌లు పెట్టుకున్నారు. అదే జ‌రిగితే దేశం త‌ర‌ఫున 21 ఏళ్ల పాటు ఆడిన క్రికెట‌ర్ గా అరుదైన రికార్డు సాధిస్తాడు. వ‌న్డేల్లో మూడు డ‌బుల్ సెంచ‌రీలు, టి20ల్లో ఐదు సెంచ‌రీలతో ప‌రిమ‌త ఓవ‌ర్ల ఫార్మాట్ కింగ్ గా నిలిచిన రోహి త్ఈ క్ర‌మంలో ఆదివారం అత్య‌ధిక కాలం దేశానికి ప్రాతినిధ్యం వ‌హించిన క్రికెట‌ర్ల‌ జాబితాలో మ‌రో అడుగు ముందుకేశాడు.

ఇప్ప‌టికి 18 ఏళ్లు దాటి..

రోహిత్ శ‌ర్మ 2007 జూన్ 23న ఐర్లాండ్ తో వ‌న్డే మ్యాచ్ ద్వారా టీమ్ ఇండియాలోకి అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్ లో రోహిత్ కు బ్యాటింగ్ రాలేదు. 107 బంతుల్లో 80 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచిన ప్ర‌స్తుత హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కావ‌డం గ‌మ‌నార్హం. ఇంకా విశేషం ఏమంటే.. ప్ర‌స్తుత చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్, సెల‌క్ట‌ర్ ఆర్పీ సింగ్ లు ఈ మ్యాచ్ తుది జ‌ట్టులో స‌భ్యులు. ఈ క్ర‌మంలో ఆదివారంతో న్యూజిలాండ్ తో వ‌డోద‌ర‌లో మొద‌లైన వ‌న్డేతో రోహిత్ టీమ్ ఇండియాకు మొద‌టి మ్యాచ్ ఆడి 18 ఏళ్ల 201 రోజులు అయింది. దేశం త‌ర‌ఫున సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వ‌హించిన ఆరో ప్లేయ‌ర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇటీవ‌ల దిగ్గ‌జ స్పిన్న‌ర్ అనిల్ కుంబ్లేను రోహిత్ అధిగ‌మించాడు.

24 ఏళ్ల పాటు...

16 ఏళ్ల వ‌య‌సులో టీమ్ఇండియాలోకి వ‌చ్చిన దిగ్గ‌జ క్రికెట‌ర్ స‌చిన్ తెందూల్క‌ర్ అత్య‌ధికంగా 24 ఏళ్ల ఒక రోజు పాటు దేశానికి ప్రాతినిధ్యం వ‌హించాడు. మొహింద‌ర్ అమ‌ర్నాథ్ (19 ఏళ్ల 310 రోజులు), లాలాఅమ‌ర్నాథ్ (19 ఏళ్లు) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు. లాలా కుమారుడే మొహింద‌ర్. ఇక ఎడ‌మ‌చేతివాటం పేస‌ర్ ఆశిష్ నెహ్రా 18 ఏళ్ల 250 రోజులు, స్పిన్న‌ర్ ఎస్.వెంక‌ట్రాఘ‌వ‌న్ 18 ఏళ్ల 214 రోజులు భార‌త్ కు ఆడారు. నెహ్రా, వెంక‌ట్రాఘ‌వ‌న్ ల‌ను రోహిత్ త‌ర్వ‌లో అధిగ‌మించే చాన్సుంది. కుంబ్లే 18 ఏళ్ల 191 రోజులు, వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ దినేశ్ కార్తీక్ 18 ఏళ్ల 58 రోజులు భార‌త్ కు ఆడారు.

వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ తో..

2027 అక్టోబ‌రులో వ‌న్డే ప్ర‌ప్రంచ క‌ప్ జ‌ర‌గ‌నుంది. అందులోనూ రోహిత్ కు చోటు ద‌క్కితే 20 ఏళ్ల‌కు పైగా భార‌త్ కు ఆడిన రికార్డును ద‌క్కించుకుంటాడు. దీంతో స‌చిన్ త‌ర్వాత రెండో స్థానానికి చేరుతాడు. 20 ఏళ్లు ఆడిన రెండో క్రికెట‌ర్ గానూ నిలుస్తాడు.

Tags:    

Similar News