నాడు చెంపలు పగలకొట్టింది.. రాఖీ కట్టి స్వీట్లు తినిపించింది

Update: 2021-08-23 10:41 GMT
నిర్లక్ష్యంగా రోడ్డు దాటటమే కాదు.. తప్పు చేయకున్నా.. కారులో నుంచి డ్రైవర్ ను బయటకు లాగి చెంపదెబ్బలు కొట్టిన లక్నో యువతి గుర్తుంది కదా. ఆ ఉదంతంతో తొలుత క్యాబ్ డ్రైవర్ దే తప్పుగా భావించారు కానీ.. సీసీ ఫుటేజ్ చూశాక మాత్రం.. తప్పంతా సదరు యువతిదేనన్న విషయం బయటకు రావటంతో.. పోలీసులు సదరు డ్రైవర్ ను విడిచిపెట్టారు.

ఈ సందర్భంగా సదరు లక్నో యువతి ప్రియదర్శిని పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఒక దశలో ఆమెను అరెస్టు చేయాలన్న డిమాండ్ ఆన్ లైన్ లో పెద్ద ఎత్తున జరిగింది. కానీ.. ఆమెపై మాత్రం పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఉదంతంలో సదరు డ్రైవర్ మీద పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తమైంది. తాజాగా ఈ థప్పడ్ గాళ్ మరోసారి తెర మీదకు వచ్చారు.
రక్షా బంధన్ రోజున ఇంటిని అందంగా అలంకరించిన ఆమె.. తాను తప్పు చేసి.. చెంపదెబ్బలు కొట్టిన క్యాబ్ డ్రైవర్ ను తన ఇంటికి ఆహ్వానించింది. అతని కోసం ప్రత్యేకంగా స్వీట్లు కొనుగోలు చేసి.. డ్రైవర్ ను సాదరంగా ఆహ్వానించటమే కాదు.. రాఖీ కట్టి.. స్వీట్లు తినిపించింది. గతంలో నడి రోడ్డు మీద ఇదే క్యాబ్ డ్రైవర్ ను 22 సార్లు చెంప దెబ్బలు కొట్టిన ఆమె తీరు తీవ్ర విమర్శలకు గురైంది.

మొత్తంగా తన తప్పును సరిదిద్దుకునే చర్యలో భాగంగా ఆమె చేసిన రాఖీ ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. దీనికంటే ముందు.. సదరు క్యాబ్ డ్రైవర్ కు సోషల్ మీడియా సాక్షిగా క్షమాపణలు చెప్పి ఉండాల్సింది. చేయని తప్పునకు ఇష్టారాజ్యంగా వ్యవహరించి.. రాఖీ రోజున చేతికి రక్షాబంధన్ కడితే సరిపోతుందా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News