మంచాలు తీసుకెళుతుంటే పిచ్చ కొట్టుడు కొట్టారు

Update: 2016-09-09 05:18 GMT
కొన్ని వ్యూహాలు అనుకోవటానికి బాగానే ఉన్నా.. అమలుకు వచ్చేసరికి తేడే.. కొట్టేస్తుంటాయి. యూపీ ఎన్నికల్లో తనదైన మార్క్ ప్రచారంతో అందరి దృష్టిలో పడాలని.. ట్రెండ్ సెట్టర్ గా నిలవాలని అనుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వేసిన ఎత్తుగడ దారుణమైన ప్లాప్ షో గా మారింది. త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ముందస్తుగా మొదలెట్టిన భారీ ప్రచారం సరికొత్తగా ఉండాలన్నఆలోచనలో భాగంగా ‘‘ఖాట్ పే చర్చా’’ పేరిట బహిరంగ సభల్లో నులక మంచాలు వేసే విధానానికి తెర తీశారు. గ్రామాల్లో రైతులు కూర్చొని మాట్లాడుకునే తీరులో నులక మంచాలు వేసి సభలు నిర్వహించాలని భావించారు.

ఇందులో భాగంగా రాహుల్ యూపీ ప్రచారం కోసం 10వేల నులక మంచాల్ని సిద్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని తొలిసారి రుద్రపూర్ లో నిర్వహించారు. బహిరంగ సభలో నులక మంచాలు వేసిన తీరుపై మీడియాలో పెద్ద ఎత్తున ఫోకస్ కావటం ఒకటైతే.. సభకు వచ్చిన వారంతా నులక మంచాల కోసం గొడవ పడటం.. సభ తర్వాత తమతో పాటు నులక మంచాల్ని ఎత్తుకెళ్లిన వైనం.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న రగడ కామెడీ షోను తలపించింది.

ఊహించని విధంగా మంచాల వ్యవహారం కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారి విమర్శలు వెల్లువెత్తేలా చేసింది. రుద్రపూర్ ఎపిసోడ్ చూసిన తర్వాతైనా ఖాట్ పే చర్చా కార్యక్రమాన్ని మార్చినా బాగుండేది. కానీ.. అలాంటివేమీ చేయని కాంగ్రెస్.. తన తదుపరి సభను గోండాలో చేపట్టారు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున మంచాలు వేశారు. యథావిధిగా రాహుల్ రావటం.. మంచాల కోసం సభకు వచ్చిన వారు పోటీ పడటం.. వారిని నిలువరించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలతో లొల్లి చేసుకుంది.
Read more!

ఈ సందర్భంగా మంచాలు ఎత్తుకెళుతున్నవారికి.. కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పెద్ద రగడే చోటు చేసుకుంది. రాహుల్ సభకు వచ్చిన వారంతా మంచాల కోసం పోటీ పడటం.. వారిని నిలువరించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలతో ఇరువర్గాల మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది. ఇది కాస్తా శ్రుతిమించి మంచాలు తీసుకెళుతున్న జనాలపై కాంగ్రెస్ కార్యకర్తలు వెంటపడి మరీ కొట్టటం కనిపించింది. దీంతో ఆగ్రహం చెందిన ప్రజలు  కాంగ్రెస్ కార్యకర్తలపై చేయిచేసుకోవటం కనిపించింది. ఖాట్ పే చర్చా పేరుతో కాంగ్రెస్ నిర్వహిస్తున్న కార్యక్రమం వివాదాస్పదంగా మారటమే కాదు కొత్త ఉద్రిక్తతలకు దారి తీసేలా ఉంది. ఓట్ల కోసం రాహుల్ మొదలెట్టిన కార్యక్రమం అందుకు సంబంధం లేని అంశాల దిశగా పయనించటంపై కాంగ్రెస్ ఫోకస్ చేస్తే మంచిది. లేకుంటే మొదటికే మోసం కలగటం ఖాయం.
Tags:    

Similar News