దిగ్గజ పరుగుల వీరుడి ‘పరుగు’ ఆగింది.. విషాదంలో క్రీడాలోకం

Update: 2021-06-19 03:03 GMT
నిలువెత్తు స్ఫూర్తి.. దిగ్గజ పరుగుల వీరుడు.. అథ్లెట్ గా తానేమిటో ప్రూవ్ చేసుకోవటమే కాదు.. క్రీడాలోకాక భారత్ కీర్తి పతాకను సగర్వంగా ఎగురవేసిన ఫ్లయింగ్ సిఖ్ మిల్కాసింగ్ (91) జీవన పరుగు ఆగింది. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు ఆయన భువి నుంచి దివికి పరుగు తీశారు. కరోనా అనంతర సమస్యలతో పోరాడిన ఆయన ఛండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన కుమారుడు ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. దీంతో.. క్రీడాలోకం విషాదంలో మునిగిపోయింది.

మిల్కాసింగ్ మరణానికి మాయదారి కరోనానే కారణంగా చెప్పాలి. ఇంటి వంట మనుషుల్లో ఒకరు పాజిటివ్ గా తేలటం.. ఆ వ్యక్తి ద్వారా మే ఇరవైన ఆయనకు కరోనా సోకింది. నాలుగు రోజుల అనంతరం ఆయన్ను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. కరోనాను జయించిన ఆయన మే 30న డిశ్చార్జి అయ్యారు. అయితే.. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవటంతో జూన్ మూడున మరోసారి ఆయన్నుఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆయన కన్నుమూశారు.

పాత తరం వారికి సుపరిచితమైన మిల్కాసింగ్.. భాగ్ మిల్కా భాగ్ హిందీ మూవీ పుణ్యమా అని.. అన్ని తరాల వారికి ఆయనేమిటో అర్థం కావటమే కాదు.. దేశం కోసం ఆయన సాధించింది ఏమిటన్నది అర్థమవుతుంది. ఈ మూవీ విడుదల తర్వాత.. ఆయన గురించి పెద్ద ఎత్తున తెలుసుకోవటమే కాదు.. ఈ తరానికి చెందిన వారు సైతం ఆయనకు ఫ్యాన్ అయ్యారు.

1932 నవంబరు 20న పాకిస్థాన్ లోని పంజాబ్ లో ఉన్న గోవింద్ పురలో మిల్కా జన్మించారు. సిక్ రాథోడ్ రాజపుత్రల కుటుంబంలో పుట్టిన ఆయన 1951లో భారత సైన్యంలో చేరారు. ఆర్మీ నిర్వహించిన పరుగుల పోటీలో ఆరో స్థానంలో నిలిచిన మిల్కా.. ఆ తర్వాత అథ్లెట్ గా మారారు. 1958 కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించారు. అదే ఏడాది టోక్యో.. 1962 జకర్తా ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణాలు సొంతం చేసుకున్నారు.  

1960లో రోమ్ లో జరిగిన ఒలింపిక్స్ 400 మీటర్ల పరుగు పందెంలో త్రుటిలో పతకాన్ని మిస్ అయ్యారు. నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. క్రీడాలోకంలో తనకంటూ ఒక ముద్ర వేసిన మిల్కాకు కేంద్రం 1959లో పద్మశ్రీతో సత్కరించింది. విషాదకరమైన విషయం ఏమంటే..మిల్కా సతీమణి నిర్మల్ కౌర్ కరోనాతో పోరాడుతూ ఈ నెల 14న మరణించారు. ఆమె మరణించిన నాలుగు రోజులకే మిల్కా కూడా మరణించటంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వారికి ముగ్గురు కుమార్తెలు.. ఒక కుమారుడు ఉన్నారు. ప్రధాని నరేంద్రమోడీతో సహా దేశ వ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు.. వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. 
Tags:    

Similar News