నిశ్చితార్థం తర్వాత మరో వంచన.. పెళ్లి పీటలు ఎక్కాలంటే ఇవి తప్పక తెలుసుకోవాలి..
ఈ మోసగాళ్ల పనితీరు చాలా సంప్రదాయబద్ధంగా మొదలవుతుంది. మొదట పెళ్లి చూపులు, ఆపై కుటుంబాల మధ్య నిశ్చితార్థం ఇవన్నీ సంప్రదాయంగా, వేడుకగా జరిపించుకుంటారు.;
పెళ్లి అనేది నూరేళ్ల పంట. రెండు మనసులు, రెండు కుటుంబాలను కలిపే పవిత్ర బంధం. అయితే, నేడు ఆ పవిత్ర బంధాన్ని కూడా కొందరు కేటుగాళ్లు తమ వికృత వాంఛలకు, ధన దాహానికి పెట్టుబడిగా మలుచుకుంటున్నారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఇటీవల వెలుగు చూస్తున్న ఘటనలు యువతులను, తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. ప్రేమ పేరుతో మోసాలు చేయడం ఒకెత్తయితే, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున, నిశ్చితార్థం ముగిసిన తర్వాత యువతులను శారీరకంగా, ఆర్థికంగా వంచించడం భీతిగొల్పుతోంది. నిశ్చితార్థం అయిపోయింది కదా అని గుడ్డిగా నమ్మితే, కోలుకోలేని దెబ్బ పడే ప్రమాదం ఉందని షీ టీమ్స్ ఇటీవల హెచ్చరికలు చేసింది.
ముందు చూపులు.. ఆపై నమ్మకద్రోహం
ఈ మోసగాళ్ల పనితీరు చాలా సంప్రదాయబద్ధంగా మొదలవుతుంది. మొదట పెళ్లి చూపులు, ఆపై కుటుంబాల మధ్య నిశ్చితార్థం ఇవన్నీ సంప్రదాయంగా, వేడుకగా జరిపించుకుంటారు. పెళ్లి ఖాయమైంది కదా అనే నమ్మకాన్ని యువతుల్లో కలిగిస్తారు. ఈ చనువును ఆసరాగా చేసుకొని, మాయమాటలతో యువతులకు దగ్గరవుతారు. ‘ఎలాగూ పెళ్ళే కదా.. ఇప్పుడైతే ఏంటి?’ అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి వారిని శారీరకంగా లోబచుకుంటున్నారు. తీరా కామ వాంఛ తీరాక, అసలు రంగు బయటపెట్టి భారీగా డబ్బు, అదనపు కట్నం కావాలని డిమాండ్ చేస్తారు.
నేరగాళ్లకు వరాలుగా మారుతున్న ‘పరువు’
నిశ్చితార్థం జరిగిపోవడం, బంధువులందరికీ తెలిసిపోవడంతో పెళ్లి ఆగిపోతే సమాజంలో తమ పరువు పోతుందని చాలా మంది యువతులు, వారి తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈ పరువు’ అనే బలహీనతనే నేరగాళ్లు ఆయుధంగా మలుచుకుంటున్నారు. పరువు పోతుందన్న భయంతో ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేయడం వల్లే, ఇటువంటి కేటుగాళ్లు అడిగినంత డబ్బు ఇవ్వాలని వేధిస్తున్నారు. పరువు కోసం మౌనంగా ఉంటే, ఆ నేరగాళ్లకు సహకరించినట్టే అవుతుంది. జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి..
*పెద్దలు కుదిర్చిన సంబంధం అయినా సరే, పెళ్లి పీటలు ఎక్కేవరకు అప్రమత్తంగా ఉండడం అత్యవసరం.
*అబ్బాయి ప్రవర్తన, అతడి స్నేహితులు, అలవాట్లపై ఆరా తీయాలి.
*పెళ్లికి ముందే ఏకాంతంగా కలవడానికి లేదంటే శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే, అది ప్రమాద సంకేతంగా భావించి తిరస్కరించాలి.
*నిశ్చితార్థం తర్వాత అకస్మాత్తుగా డబ్బు డిమాండ్ చేసినా, బ్లాక్ మెయిల్ చేసినా అది నయవంచన అని గుర్తించి ధైర్యంగా నిలబడాలి.
ధైర్యంగా ముందుకు రండి
మోసగాళ్ల చేతిలో చిక్కుకున్న యువతులు భయపడకుండా ముందుకు రావాలి. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. బాధితులు వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555కు గానీ, లేదంటే అత్యవసర సేవల కోసం 100కు గానీ కాల్ చేయవచ్చు. చట్టం, పోలీస్ వ్యవస్థ అండగా ఉంటుంది. మీ మౌనం నేరగాళ్లకు బలాన్ని ఇస్తుంది, మీ ధైర్యం వారికి శిక్ష పడేలా చేస్తుంది.
వివాహం అనేది నమ్మకంపై ఆధారపడిన ఒక పవిత్రమైన తంతు. కానీ ఆ నమ్మకం అంధవిశ్వాసంగా మారకూడదు. నిశ్చితార్థం అనేది పెళ్లికి పునాది మాత్రమే తప్ప, అది పూర్తి స్థాయి వివాహం కాదు. కట్నం కోసం వేధించినా, శారీరక లొంగుబాటు కోసం ఒత్తిడి చేసినా అది ప్రేమ కాదు, కేవలం వంచన మాత్రమే. అప్రమత్తంగా ఉండి, ఇటువంటి కేటుగాళ్ల పట్ల జాగ్రత్త వహించడం ద్వారా మీ జీవితాన్ని, మీ కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవచ్చు. యువతులు తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా, ఇలాంటి అక్రమాలను ఎదురించాల్సిన సమయం ఆసన్నమైంది.