పాల రూపంలో మృత్యువు.. రాజమహేంద్రవరంలో కల్తీ కలకలం.. పెరుగుతున్న మృతులు

బాధితులు అందరికీ ఒక వ్యక్తే పాలు పోస్తుంటాడని చెబుతున్నారు. దీంతో బాధితులు అస్వస్థతకు గురికాడానికి పాలుకల్తీ కావడమే కారణమని అనుమానాలు వ్యక్తమయ్యాయి.;

Update: 2026-02-23 09:14 GMT

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆస్పత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ నెల 15న ఓ వ్యాపారి నుంచి కొనుగోలు చేసిన పాలు తాగడం వల్ల పలువురు అనారోగ్యం పాలయ్యారని చెబుతున్నారు. పాలు తాగిన వెంటనే కొందరు వాంతులు చేసుకుని ఆస్పత్రుల్లో చేరారు. ఇలా చేరిన వారి కిడ్నీలు పనిచేయడం మానేసినట్లు వైద్యులు గుర్తించారని అంటున్నారు. దీనిని వైద్య పరిభాషలో ‘అనూరియా’గా చెబుతున్నారు. అనూరియా అంటే కిడ్నీలు పనిచేయకపోవడం, మూత్ర విసర్జన పూర్తిగా నిలిచిపోవడంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ నెల 15న పాలు తాగిన పలవురు అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో లాలా చెరువు చౌడేశ్వరి నగర్ కు చెందిన ఎన్.శేషగిరిరావు (72), రాధా కృష్ణమూర్తి (74) సోమవారం ఉదయం మరణించారు. ఈ ఇద్దరి కంటే ముందు అదే ప్రాంతానికి చెందిన భాగిశెట్టి కనకరత్నం (76), తాడి కృష్ణవేణి (75) కొద్దిరోజుల క్రితమే మృతి చెందారు. మరో 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. వీరిలో 5 నెలల శిశువు మరియు 3 ఏళ్ల బాలుడు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

బాధితులు అందరికీ ఒక వ్యక్తే పాలు పోస్తుంటాడని చెబుతున్నారు. దీంతో బాధితులు అస్వస్థతకు గురికాడానికి పాలుకల్తీ కావడమే కారణమని అనుమానాలు వ్యక్తమయ్యాయి. పాలు, పెరుగు చేదుగా ఉన్నాయని బాధితులు తెలిపారు. ఆ పాలు తాగిన తర్వాతే వాంతులు, పొట్ట ఉబ్బడం వంటి సమస్యలు మొదలయ్యాయని బాధిత కుటుంబ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాలు పోసిన కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గణేష్ అనే పాల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన సుమారు 105 కుటుంబాలకు పాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

కల్తీ పాలు తాగిన పలువురు అస్వస్థతకు గురికావడంపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించినట్లు చెబుతున్నారు. అలాగే పాల శాంపిల్స్‌ను టాక్సికాలజీ పరీక్షల కోసం విశాఖపట్నం ల్యాబ్‌కు పంపించారు. ఈ నివేదికలు వస్తేనే పాలల్లో ఖచ్చితంగా ఏ విషపూరిత పదార్థం కలిశారనేది స్పష్టమవుతుందని చెబుతున్నారు. ఈ ఘటనతో రాజమహేంద్రవరం నగరం ఉలిక్కి పడింది. నిందితుడు గణేష్ పాలు విక్రయిస్తున్న ప్రాంతాలైన లాలా చెరువు, హౌసింగ్ బోర్డు కాలనీ, చౌడేశ్వరి నగర్ ప్రాంతాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News