సుప్రీం తీర్పు ఫేవర్ గానే ఉంది.. ఎమ్మెల్సీ అనంత బాబు ఫస్ట్ రియాక్షన్
డ్రైవర్ హత్య కేసులో సుప్రీంకోర్టు తనకు ఫేవర్ గానే తీర్పునిచ్చిందని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యాఖ్యానించారు.;
డ్రైవర్ హత్య కేసులో సుప్రీంకోర్టు తనకు ఫేవర్ గానే తీర్పునిచ్చిందని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యాఖ్యానించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో అనంతబాబు డిఫాల్ట్ బెయిలును విచారణ పూర్తయ్యేవరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ తీర్పు వచ్చిన తర్వాత శాసనమండలి నుంచి ఎమ్మెల్సీ అనంత బాబు బయటకు వచ్చేశారని, రెండు రోజులుగా ఆయన కనిపించకుండా తిరుగుతున్నారని కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఇదే కేసులో అనంత బాబు భార్య లక్ష్మీదుర్గను ఏ2 నిందితురాలిగా చేర్చడంతో ఇద్దరూ అదృశ్యమయ్యారని మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. వీటిని ఖండిస్తూ సోమవారం ఓ మీడియా చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ఎమ్మెల్సీ అనంతబాబు.
తాను పరారీలో ఉన్నానన్న ప్రచారాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు ఖండించారు. సుప్రీంకోర్టు తన బెయిలును పర్మినెంట్ బెయిలుగా మార్చేసిందని వెల్లడించారు. బెయిలుపై ఉన్న తాను పారిపోవాల్సిన అవసరం ఏంటి అని ఎదురు ప్రశ్న వేశారు. శుక్రవారం సుప్రీం తీర్పు వచ్చిన సమయంలో కోర్టు పని నిమిత్తం మండలి నుంచి బయటకు వచ్చానని వెల్లడించారు. ‘‘ఇప్పుడు మీ ముందే ఉన్నాను.. నేనెక్కడికి వెళ్లిపోతాను. మీడియా టీఆర్పీల కోసం ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు’’ అంటూ ఎమ్మెల్సీ అనంతబాబు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కావాలనే తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. వైసీపీలో చురుగ్గా పనిచేస్తున్నానన్న అక్కసుతోనే తన భార్యను సైతం కేసులో ఇరికించారని అనంత బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమి అధికారంలోకి వచ్చిన నుంచి తమ కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని ఎమ్మెల్సీ అనంతబాబు ఆరోపించారు. తనపై ఉన్న కేసుకు కులానికి సంబంధం లేదని, కేసుకు కులాన్ని అపాదించి తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. తన చుట్టూ ఎస్సీ, ఎస్టీలే ఎక్కువగా ఉంటారని, ఈ కేసుకు పార్టీకి ఎలాంటి సంబంధం లేని స్పష్టం చేశారు. తనపై నమోదైన కేసును వ్యక్తిగత కోణంలోనే చూడాలని, రాజకీయాలకు ముడిపెట్టవద్దని అనంతబాబు కోరారు. ఇక డ్రైవర్ హత్య కేసులో అనంతబాబుకు సహకరించారన్న ఆరోపణలతో నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడంపైన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
హత్య కేసు నమోదు చేసిన పోలీసులు తనకు అసలు సహకరించలేదని వ్యాఖ్యానించారు. పోలీసులు సహకరిస్తే 7 నెలలుపాటు జైలులో ఉంటానా? అంటూ ప్రశ్నించారు. ఏ కేసులో అయినా గరిష్టంగా 90 రోజులకే బెయిలు వస్తుందని, కానీ తనను రెండు వందల రోజులకు పైగా జైలులో నిర్బంధించారని అనంతబాబు తెలిపారు. తనపై నమోదైన కేసును కోర్టులో తేల్చుకుంటానని, తాను భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. యథావిధిగా శాసనమండలి సమావేశాలకు హాజరవుతానని వెల్లడించారు. తిరుమల లడ్డూ కల్తీ అంశాన్ని డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం కావాలనే తన కేసును తెరపైకి తెస్తోందని అనంతబాబు ఆరోపించారు.