కేంద్రం వెనకడుగు.. ఈ పరిస్థితి ఎలా వచ్చిందంటే..
ఈ క్రమంలో జూన్ 28న సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించడంతో ఉద్యమానికి బలమైన నైతిక కేంద్రం లభించి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగిందని అంటున్నారు.
కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన పరిణామాలపై విస్తృత చర్చ జరుగుతోంది. 12 ఏళ్ల ప్రధాని మోదీ పాలనలో తొలిసారి ప్రజా ఉద్యమానికి తలొగ్గి ఒక మంత్రితో రాజీనామా చేయించాల్సిరావడం రాజకీయంగా ప్రభుత్వానికి ఎదురుదెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో అంటే ప్రధాని మోదీ 2.0 ప్రభుత్వంలో సహాయమంత్రిగా పనిచేసిన ఎంజే అక్బర్ కూడా రాజీనామా చేసిన అప్పటికి ప్రస్తుత పరిస్థితులకు చాలా స్పష్టమైన తేడా ఉందని అంటున్నారు. ఎంజే అక్బర్ రాజీనామా నైతిక విలువలకు సంబంధించిన అంశమని, ఆ సమయంలో ప్రధాని మోదీపై పెద్దగా ఒత్తిడి కూడా లేదని అంటున్నారు. కానీ, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో జెన్ జీ యువత నేతృత్వంలో సాగిన ప్రజా ఉద్యమం తీవ్రత చాలా ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాని మోదీ స్వయంగా జోక్యం చేసుకుని విద్యార్థుల డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇచ్చినా, విద్యామంత్రి రాజీనామా చేస్తే కానీ తాము అంగీకరించేది లేదంటూ జెన్ జీ యువత మొండిపట్టు పట్టడమే ప్రభుత్వం దిగి రావాల్సివచ్చిందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారంతో కేంద్రం వెనక్కి తగ్గిందా? లేక వ్యూహాత్మక నిర్ణయమా? అనే చర్చ జరుగుతోంది. అయితే కేంద్ర మంత్రి రాజీనామాకు దారితీసిన పరిణామాలు పరిశీలిస్తే కేంద్రం వెనక్కి తగ్గిందనే అభిప్రాయమే ఎక్కువగా వ్యక్తమవుతోంది. విద్యార్థుల ఉద్యమానికి తోడుగా ఆర్ఎస్ఎస్ ప్రముఖులు మోహన్ భాగవత్, మురళీమనహర్ జోషి వంటివారు చేసిన కామెంట్లు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేశాయని అంటున్నారు. ఉద్యమం బలపడేందుకు దారితీసిన పరిణామాలను అంచనా వేయడంలో కేంద్రం విఫలమవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కూడా విశ్లేషిస్తున్నారు.
విద్యామంత్రి రాజీనామా అనేది కేవలం ఒక్కరోజు తీసుకున్న నిర్ణయం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. మే 3 నుండి జూలై 25 వరకు అంటే దాదాపు 84 రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న పరిణామాలే ఇక్కడ అత్యంత కీలకమని అంటున్నారు. పరీక్షా వ్యవస్థ వైఫల్యం, ఉదృతంగా సాగిన విద్యార్థి ఉద్యమం, ప్రభుత్వ వ్యూహం లోపించడం వంటివి అన్నీ కలిసి ఈ అనూహ్య ముగింపునకు దారితీసిందని చెబుతున్నారు. తొలుత నీట్ ప్రశ్నపత్రం లీక్ కావడం పెద్ద దుమారానికి దారితీయగా, పరీక్షను రద్దు చేయాల్సి రావడం ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు. ఈ వివాదం సద్దుమణుగుతున్న దశలోనే సీబీఎస్‌ఈ ఫలితాలు కొత్త సమస్యలను తీసుకువచ్చాయని అంటున్నారు. సీబీఎస్ఈ ప్రశ్నపత్రాల ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానంలో మసక స్కానింగ్, మాయమైన పేజీలు, తారుమారైన జవాబు పత్రాలు వంటి లోపాలు బయటపడటంతో మూల్యాంకనంలో తీవ్ర నిర్లక్ష్యం స్పష్టమైంది. ఇది విద్యాశాఖ వైఫల్యంపై మరోమారు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిందని అంటున్నారు. ఈ సమయంలో కేంద్రం సరైన విధంగా జోక్యం చేసుకున్నా పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని అంటున్నారు.
ఇక నీట్ పరీక్ష రద్దు, రీనీట్ నిర్వహించిన జూన్ 21 మధ్య 37 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటం కూడా ప్రభుత్వంపై ఆగ్రహం తీవ్రమయ్యేలా చేసిందని అంటున్నారు. అప్పటివరకు పరీక్ష సంస్కరణల డిమాండ్ కాస్తా ప్రభుత్వ జవాబుదారీతనం వైపు మళ్లిందని, ఇక ఆ తర్వాత 'మంత్రి రాజీనామా' ప్రధాన నినాదంగా రూపాంతరం చెందిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నినాదంతోనే జూన్ 6న జంతర్‌మంతర్ ధర్నాతో సీజేపీ (జెన్‌జీ) ఉద్యమం ఆన్‌లైన్ నుంచి ఆఫ్‌లైన్‌కు మారిందని విశ్లేషిస్తున్నారు. ఇక అక్కడి నుంచి ఉద్యమ స్వరూపం మారిపోవడమే కాకుండా కేంద్రంపై యువత ఆగ్రహా జ్వాల మరింత ఎక్కువైందని అంటున్నారు.
ఈ క్రమంలో జూన్ 28న సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించడంతో ఉద్యమానికి బలమైన నైతిక కేంద్రం లభించి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగిందని అంటున్నారు. పార్లమెంటరీ సమావేశాలు ప్రారంభమైన జూలై 20 నాటికి పరిస్థితి పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో నుంచి జారిపోయిందని చెబుతున్నారు. ఉద్యమకారులు ప్రకటించిన 'సంసద్ చలో' కార్యక్రమానికి దేశవ్యాప్తంగా యువత నుంచి అనూహ్య మద్దతు లభించడం, లక్షలాది మంది ఢిల్లీకి తరలివచ్చిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చిందని చెబుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం జెన్ జీకి పెద్ద ఎత్తున సానుభూతి తీసుకువచ్చిందని విశ్లేషిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో వాజ్‌పేయి హయాంలో విద్యామంత్రిగా పనిచేసిన దిగ్గజనేత మురళీ మనోహర్ జోషి ప్రస్తుత ప్రభుత్వ వ్యవహార శైలిని తీవ్రంగా ఆక్షేపించారు. అలాగే, బీజేపీతో మంచి సంబంధాలున్న సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే కూడా విద్యార్థులకు మద్దతు పలకడంతో పాలకవర్గం పూర్తిగా ఇరుకున పడిందని చెబుతున్నారు. మరోవైపు త్వరలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటం కూడా ప్రభుత్వాన్ని కలవరపెట్టిందని, చివరికి బీజేపీకి దిశానిర్దేశం చేసే మోహన్ భాగవత్ కూడా కొత్తతరం ప్రశ్నిస్తోందని, దానికి కేవలం ఆజ్ఞాపిస్తే కుదరదని తేల్చిచెప్పారని గుర్తు చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత తీవ్రతను గమనించి, ఆ ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవడానికి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించడం ఒక్కటే మార్గంగా భావించి ఈ కీలక నిర్ణయం తీసుకుందని అంటున్నారు. మొత్తానికి కాక్రోచ్ పార్టీ సారథ్యంలోని జెన్ జీ ఉద్యమతో కేంద్రం వెనకడుగు వేయాల్సివచ్చిందని విశ్లేషిస్తున్నారు.