మెక్సికో సైన్యం మెరుపుదాడి.. ప్రపంచ డ్రగ్ మాఫియా డాన్ హతం
ప్రపంచవ్యాప్తంగా తలనొప్పిగా మారిన డ్రగ్స్ దందాకు సంబంధించి.. ప్రపంచ డ్రగ్ మాఫియా డాన్ గా అభివర్ణించే జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అధినేత నెమీసియా ఎల్ మెంచో హతమయ్యాడు.;
ప్రపంచవ్యాప్తంగా తలనొప్పిగా మారిన డ్రగ్స్ దందాకు సంబంధించి.. ప్రపంచ డ్రగ్ మాఫియా డాన్ గా అభివర్ణించే జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అధినేత నెమీసియా ఎల్ మెంచో హతమయ్యాడు. మెక్సికో సైన్యం జరిగిపిన మెరుపుదాడితో ఈ పరిణామం చోటు చేసుకుంది. మెక్సికోలోని జలిస్కో రాష్ట్రంలోని తపాల్పా పట్టణంతో సైన్యం నిర్వహించిన మెరుపుదాడిలో ఈ పరిణామం చోటు చేసుకుంది. తాజాగా మెక్సికో సైన్యం విడుదల చేసిన ప్రకటన ప్రకారం 59 ఏళ్ల ఎల్ మంచోను పట్టుకునేందుకు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ లో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించే వేళలో ప్రాణాలు కోల్పోయినట్లుగా పేర్కొన్నారు.
అమెరికా నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో ఈ ప్రత్యేక ఆపరేషన్ ను నిర్వహించారు. జూలిస్కో రాష్ట్రంలోని తపాల్ప సిటీలో అతను ఉన్న ప్రాంతాన్ని సైన్యం చుట్టుముట్టి సోదాల్ని నిర్వహించింది. ఈ క్రమంలో అతడి అనుచరులు కాల్పులు జరపగా.. సైన్యం ప్రతిదాడి జరిపింది. దీంతో కొన్ని గంటల పాటు సాగిన ఆపరేషన్ లో చివరకు డ్రగ్ మాఫియా డాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఎల్ మెంచో 2009లో జాలిస్కో న్యూజనరేషన్ కార్టెల్ అనే డ్రగ్ ముఠాను ఏరపాటు చేశారు. గడిచిన పేళ్లలో మెక్సికోలో పవర్ ఫుల్ క్రైం సిండికేట్ గా ఏర్పడిన అతను.. అమెరికాకు ప్రధాన డ్రగ్స్ అక్రమ రవాణాదారుగా మారారడు.
అంతర్జాతీయ డ్రగ్ మాఫియా డాన్ కోసం గడిచిన కొన్నేళ్లుగా తీవ్రంగా వెతుకుతున్నారు. అతడ్ని పట్టించిన వారికి 15 మిలియన్ డాలర్ల రివార్డు ఉంది. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.136 కోట్ల భారీ రివార్డు అతడి తల మీద ఉంది. ఈ అంతర్జాతీయ డ్రగ్ డాన్ మరణంతో మెక్సికోలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇతడి మరణవార్త సమాచారం బయటకు వచ్చినంతనే అతడి ముఠాకు చెందిన వారు విధ్వంసానికి దిగారు. సుమారు 20కు పైగా పరధాన రహదారులను ట్రక్కులతో.. వాహనాలతో దిబ్బంధించి నిప్పు పెట్టారు.
డ్రగ్ డాన్ మరణవార్తతో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు రిపోర్టు అయ్యాయి. సైనికులు జరిపిన ప్రత్యేక ఆపరేషన్ లో ఎల్ మెంచోతో పాటు ఆరుగురు సాయుధ దుండగులు హతమయ్యారు. అదే సమయంలో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. షాకింగ్ అంశం ఏమంటే.. సైన్యం జరిపిన మెరుపుదాడి వేళలో అనుమానితుల వద్ద భద్రతా దళాలు.. విమానాల్ని కూల్చే రాకెట్ లాంచర్లు లాంటి అత్యాధునిక ఆయుధాలనుసైన్యం స్వాధీనం చేసుకుంది.
తాజా పరిణామాల నేపథ్యంలో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్ బామ్ దేశ ప్రజలకు ప్రత్యేక సందేశాన్ని పంపారు. దేశ ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని.. హింసాత్మక ఘటనలకు దూరంగా ఉండలని కోరారు. హింస కారణంగా చోటు చేసుకున్న పరిణామాలతో జలిస్కో రాజధాని గ్వాడలజారాలో జనజీవనం స్తంభించింది. షాపులు.. పెట్రోల్ బంకులు మూసేశారు. స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఇతన్ని అమెరికాతో సహా పలు దేశాలు ప్రమాదకర ఉగ్రవాదిగా పరిగనిస్తారు. ఎల్ మెంచోఅంతం.. మెక్సికోతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డ్రగ్స్ మాఫియాపై సాగుతున్న పోరాటంలో కీలక మలుపుగా అభివర్ణిస్తున్నారు.
డ్రగ్స్ నియంత్రణలో మెక్సికో వైఫల్యాలపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజా పరిణామాలపై ఆయన సంత్రప్తి వ్యక్తం చేసినట్లుగా చెబుతన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో మెక్సికోలో ఉన్న భారతీయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భారత ప్రభుత్వం ప్రత్యేక సూచనలు చేసింది. ప్రస్తుతం మెక్సికోలో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితుల కారణంగా ఆ దేశంలో ఉన్న భారత పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని.. బయటకు రావొద్దని స్పష్టం చేసింది. తదుపరి నోటీసులు ఇచ్చే వరకు బయటకు రావొద్దని.. ఎంతో అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని చెప్పింది. స్థానిక అధికారుల అప్ డేట్లను తెలుసుకోవాలని సూచించింది. మెక్సికోలోని పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఈ ప్రకటన స్పష్టం చేస్తుందని చెప్పాలి.