బిగ్ బ్రేకింగ్ - సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ, సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ డిస్మిస్

సుప్రీం తీర్పుతో తిరుమలకు కల్తీ నెయ్యి వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయింది. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీం ఆదేశాలతో సీబీఐ సిట్ దర్యాప్తు చేసింది.;

Update: 2026-02-23 07:37 GMT

తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. విపక్ష వైసీపీ తరఫున వకల్తా పుచ్చుకున్న సుబ్రహ్మణ్యస్వామి కల్తీ నెయ్యిపై విచారణకు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సోమవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సీజేఐ బెంచ్ ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదంటూ కొట్టివేసింది. ఈ పరిణామంతో ఇటు వైసీపీకి, అటు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి గట్టి ఎదురుదెబ్బగానే చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ పరిపాలనా పరమైన లోపాల గుర్తింపునకు సంబంధించినది అంటూ సుప్రీం ధర్మాసనం సమర్థించింది.

సుప్రీం తీర్పుతో తిరుమలకు కల్తీ నెయ్యి వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయింది. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీం ఆదేశాలతో సీబీఐ సిట్ దర్యాప్తు చేసింది. దాదాపు 35 మంది నిందితులను అరెస్టు చేసింది. పాలుతో తయారు చేయాల్సిన నెయ్యికి బదులుగా రసాయనాలతో నెయ్యిని తయారు చేశారని సీబీఐ సిట్ నిర్ధారించింది. అయితే కల్తీ నెయ్యి సరఫరాకు కారణమైన సూత్రధారులు, బాధ్యులను గుర్తించేందుకు కూటమి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ను రెండు రోజుల క్రితం నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ ను కమిషన్ చైర్మన్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిషన్ టీటీడీ నెయ్యి కొనుగోలు టెండర్లలో జరిగిన లోటుపాట్లతో పాటు సిట్ నివేదికను అధ్యయం చేసి 45 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సివుంది.

అయితే ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ను సవాల్ చేస్తూ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ పై ప్రభుత్వం మరో కమిషన్ ను నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ వేయడానికి వైసీపీ మద్దతు తెలిపింది. ఆ పార్టీయే వెనకుండి ఈ పిటిషన్ వేయించినట్లు ప్రచారం జరిగింది. సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడాన్ని వైసీపీ అనుకూల మీడియా హైలెట్ చేసింది. దినేష్ కుమార్ కమిషన్ ను చంద్రబాబు సొంత కమిటీగా అభివర్ణించింది.

ఇక సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ ను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఓవర్ లాపింగ్ కిందకు రాదని వెల్లడించింది. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినా దానికి అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో కల్తీ నెయ్యి వ్యవహారంలో సూత్రధారుల పాత్రను బయటపెట్టేందుకు ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News