డ్యాన్నసింగ్ డాఫోడిల్స్.. హైదరాబాద్ కు మరో బిగ్ ప్రాజెక్టు.. ఇవి తెలుసుకోవాల్సిందే..
భాగ్యనగర రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ సంచలనం జరగబోతోందా? అంటే అవునున్న సమాధానం వినిపిస్తోంది.;
భాగ్యనగర రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ సంచలనం జరగబోతోందా? అంటే అవునున్న సమాధానం వినిపిస్తోంది. హైదరాబాద్ తూర్పు ప్రాంతమైన ఘట్కేసర్ సమీపంలో 72 అంతస్తుల టవర్‌ను నిర్మిస్తున్నట్లు ఒక కొత్త రియల్ ఎస్టేట్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. సుమారు 244.6 మీటర్ల ఎత్తుతో ప్రతిపాదించిన ఈ ‘డ్యాన్సింగ్ డాఫోడిల్స్’ ప్రాజెక్టు, పూర్తయితే తూర్పు హైదరాబాద్‌లోనే అత్యంత ఎత్తైన నివాస ప్రాజెక్టుగా చరిత్ర సృష్టించనుంది. అయితే, ఈ ప్రకటన రియల్టర్లు, పెట్టుబడిదారులలో ఉత్సాహం కంటే సందేహాలను రేకెత్తిస్తోంది. 2025, డిసెంబరులో తొలిసారిగా తెరపైకి వచ్చిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు ప్రాథమిక అనుమతుల కోసం దరఖాస్తు చేయడంతో మరోసారి చర్చ మొదలైంది.
ఆర్థిక నమూనాపై ప్రశ్నలు
ఈ ప్రాజెక్టుపై సందేహాలు రావడానికి ప్రధాన కారణం అది ఎంచుకున్న ప్రదేశం. ఘట్కేసర్ ఓఆర్ఆర్ (ORR) సమీపంలో, శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాల, రైల్వే ట్రాక్ వంటి ప్రాంతాల మధ్య ఇంతటి భారీ, విలాసవంతమైన డిజైన్‌తో కూడిన టవర్‌ను నిర్మించడం ఎంతవరకు ఆచరణాత్మకం? అనేది నిపుణుల ప్రశ్న. సాధారణంగా అత్యంత ఎత్తైన భవనాలు (High-rise buildings) నిర్మించడానికి అయ్యే వ్యయం చాలా ఎక్కువ. ఘట్కేసర్ వంటి ప్రాంతాల్లో ఫ్లాట్ల, ప్లాట్ల విక్రయ ధరలు, నిర్మాణ వ్యయాల మధ్య సమతుల్యత ఎలా ఉంటుందనేది ఆర్థిక నమూనా (Financial model) పరంగా పెద్ద సవాల్.
గత అనుభవాల చేదు జ్ఞాపకాలు
పెద్ద వాగ్ధానాలతో మొదలై, ఏళ్ల తరబడి సాగుతున్న ప్రాజెక్టులు హైదరాబాద్‌లో అనేకం ఉన్నాయి. గతంలో ‘ఏలియన్స్ స్పేస్ స్టేషన్’ వంటి ప్రాజెక్టులు అతిపెద్ద వాగ్ధానాలతో ప్రకటనలు ఇచ్చినా, వాటి పూర్తి కావడానికి పట్టిన సుదీర్ఘ సమయం పెట్టుబడిదారులకు చేదు అనుభవాలను మిగిల్చింది. కేవలం కాగితంపై, ప్రకటనల్లో ఆకట్టుకునే భవిష్యత్తు ప్రాజెక్టులు వాస్తవ రూపం దాల్చడం ఎంత కష్టమో గత చరిత్ర చెబుతోంది. ఘట్కేసర్ విషయానికే వస్తే, 'సింగపూర్ టౌన్ షిప్’ కూడా ప్రారంభంలో భారీ అంచనాలతో మొదలైంది. కానీ ఆ ఉత్సాహం క్రమంగా మసకబారింది. అక్కడ పెట్టుబడి పెట్టిన వారు ఆశించిన స్థాయిలో రాబడి చూడలేక ఆస్తులను విక్రయించడమో లేదంటే నష్టాలతో కాలం వెళ్లదీయడమో మనం చూస్తున్నాం.
అనుమతుల అడ్డంకి
గతంలో ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రాండ్ 100 అంతస్తుల భవనాన్ని ప్లాన్ చేసినప్పటికీ, అవసరమైన అనుమతులు లభించక దాన్ని 50 అంతస్తుల చొప్పున రెండు టవర్లకు కుదించాల్సి వచ్చింది. ఇదే తరహా పరిణామం ‘డ్యాన్సింగ్ డాఫోడిల్స్’ విషయంలోనూ జరగవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 244 మీటర్ల ఎత్తు అంటే అనేక రకాల భద్రతా మరియు పర్యావరణ అనుమతులు అవసరం అవుతాయి. ప్రాజెక్టు పరిమాణాన్ని భవిష్యత్తులో తగ్గించే అవకాశం కూడా లేకపోలేదు.
పెట్టుబడిదారులకు సూచనలు
*ఒక ప్రాజెక్టు ఎత్తు లేదంటే దాని డిజైన్ చూసి మోసపోకుండా, దాని ఆచరణాత్మకతను గమనించడం ముఖ్యం.
*డెవలపర్ ట్రాక్ రికార్డ్: సదరు కొత్త కంపెనీకి గతంలో ఇలాంటి భారీ ప్రాజెక్టులు పూర్తి చేసిన అనుభవం ఉందా? సకాలంలో పూర్తి చేసిందా..? అక్కడి వారి అనుభవాలను తెలుసుకోవాలి.
*ప్రాంతం అభివృద్ధి: ఘట్కేసర్ భవిష్యత్తులో అంతటి ఖరీదైన నివాసాలకు వేదిక కాగలదా అన్న కోణంలో ఆలోచించాలి.
*అనుమతులు: కేవలం దరఖాస్తు చేస్తే సరిపోదు, అనుమతులు పొందిన తర్వాతే ఆ ప్రాజెక్టుకు చట్టబద్ధత లభిస్తుంది.
హైదరాబాద్ తూర్పున అభివృద్ధి ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ ఆ అభివృద్ధి వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్' వంటి ప్రాజెక్టులు కేవలం కలలుగా మిగిలిపోకుండా, పటిష్టమైన ఆర్థిక ప్రణాళికతో ముందడుగు వేస్తేనే రియల్ ఎస్టేట్ రంగంపై ప్రజల్లో నమ్మకం ఉంటుంది. పెట్టుబడిదారులు కూడా కేవలం భారీ భవనాల మాయలో పడకుండా, క్షేత్ర స్థాయి వాస్తవాలను బేరీజు వేసుకోవడం శ్రేయస్కరం.