పార్టీ షాక్ ఇచ్చిందని ఆత్మహత్యాయత్నం?

Update: 2022-01-16 10:58 GMT
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల వేడి రాజుకుంది. ఉత్తరప్రదేశ్ లో జరిగే ఎన్నికలు కేంద్రంలోనే రాబోయేది ఎవరి సర్కార్ అనేది తేల్చనుంది. ఎందుకంటే మెజార్టీ ఎంపీ సీట్లు ఉన్న ఈ రాష్ట్రంలో గెలవడానికి అన్ని పార్టీలు చావోరేవో అన్నట్టుగా తలపడుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

తాజాగా అన్ని పార్టీలు టికెట్ల కేటాయింపు విషయంలో జాగ్రత్త వహిస్తూ గెలుపు గుర్రాలను మాత్రమే ఎంపిక చేసి బరిలోకి దించుతున్నాయి. ఆయా పార్టీల అదిష్టానం ఇచ్చే షాక్ లకు అసెంబ్లీ టికెట్ ఆశావహులు తీవ్రమైన భంగపాటుకు గురి అవుతున్నారు.

తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ ఓ నేత ఆత్మహత్యాయత్నానికి పాల్పాడ్డాడు. సమాజ్ వాదీ పార్టీ కార్యాలయం ఎదుట అలీగఢ్ కు చెందిన ఎస్పీ నేత ఆదిత్యఠాకూర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలు అడ్డుకొని కాపాడారు.

ఆదిత్యఠాకూర్ ఆలీఘడ్ లోని ఛారా నియోజకవర్గం నుంచి ఎస్పీ తరుఫున టికెట్ ఆశించాడు. పార్టీ కోసం పనిచేస్తున్న అతడికి టికెట్ వస్తుందని భావించాడు. కానీ చివరి క్షణంలో పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆదిత్య ఠాకూర్ పార్టీ ఆఫీసు ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన యూపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇక ఇటీవలే ముజఫర్ నగర్ లోని చార్తావాల్ స్థానం నుంచి టికెట్ ఆశించిన బీఎస్పీ నేత ఆర్షద్ రాణా మీడియా ముందు బోరున విలపించాడు. తాజాగా మరో నేత ఏకంగా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో యూపీ ఎన్నికలు వేడెక్కాయి.
Tags:    

Similar News