డెల్టా వేరియంట్ ఉగ్రరూపం లెక్క చెప్పిన ప్రముఖ శాస్త్రవేత్త

Update: 2021-09-10 04:21 GMT
సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ.. సింఫుల్ గా చెప్పాలంటే సీసీఎంబీ. ఈ ప్రతిష్ఠాత్మక సంస్థకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు డాక్టర్ వినయ్ నందుకూరి. తాజాగా ఏపీకి వచ్చిన ఆయన ఒక ప్రముఖ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాల్ని ప్రస్తావించారు. కరోనాకు సంబంధించి ఇప్పుడు అందరిలో ఉన్న పలు అనుమానాల్ని.. సందేహాల్ని తీర్చే ప్రయత్నం చేశారు. థర్డ్ వేవ్.. డెల్టా వేరియంట్ తో పాటు.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా పాజిటివ్ బారిన పడటం ఎందుకన్న విషయాల్ని ఆయన వివరించారు. ఆయన చెప్పిన విషయాల్లో ముఖ్యమైనవి చూస్తే..

- దేశంలో అత్యంత ప్రభావాన్ని చూపించింది డెల్టా వేరియంటే. ఈ రోజుకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ డెల్టా వేరియంట్ ఉంది. అదిప్పుడు 25 రకాల సబ్ లీనియన్స్ వేరియంట్ లను క్రియేట్ చేసుకుంది. వీటిని సంక్షిప్తంగా ఈవై 1 మొదలు ఈవై 25 పేరుతో పిలుస్తుంటాం. ఇప్పుడు మనం సెకండ్ వేవ్ చివరి దశలో ఉన్నాం. థర్డ్ వేవ్ గురించి మనమేం మాట్లాడుకున్నా.. అది ఊహాజనితమే అవుతుంది.

- అసలు థర్డ్ వేవ్ వస్తుందా? రాదా? అని కూడా ఎవరూ చెప్పలేరు. థర్డ్ వేవ్ అన్నది రకరకాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దేశాన్ని గడగడలాడించిన సెకండ్ వేవ్ లో 60 వేలకు పైగా శాంపిల్లను జినోమిక్ సర్వే చేశాం. అందులో డెల్టా వేరియంట్ ప్రభావమే ఎక్కువగా ఉంది. వీటిల్లో ఏవై4.. ఏవై12 రెండు ఎక్కువగా ప్రభావాన్ని చూపాయి. డెల్టా తర్వాత కొత్త వేరియంట్ రాలేదు. డెల్టా ప్లస్ అంటున్నారు కానీ.. దానిపై స్పష్టత లేదు.

- రెండు డోసుల వ్యాక్సిన్ తర్వాత కూడా కొందరు కరోనా బారిన పడ్డారు. వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే.. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో తీవ్రత తక్కువగా ఉందని తేలింది. డెల్టా వేరియంట్ లో వైరస్ లోడ్ చాలా ఎక్కువగా ఉంది. వ్యాక్సిన్ ఇమ్యునిటీని కూడా తప్పించుకొని మరీ డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందింది.

- కేరళలో ఇప్పుడు సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో ఉంది. ఢిల్లీలో తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కేరళలో సీరో సర్వెలెన్స్ 40 శాతమే. అప్పట్లో ఢిల్లీలో 70 శాతానికి పైనే ఉంది. సెకండ్ వేవ్ దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వేళలో వచ్చింది. ప్రస్తుతానికి దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ముగింపు దశలోఉంది.

- మన దేశానికి కరోనా వచ్చి దాదాపురెండేళ్లు కావొస్తోంది. ప్రజల్లో ఇమ్యునిటీ పెరుగుతుంది కాబట్టి.. బలహీనపడుతుందనే అనుకుంటున్నాం. అయితే.. డెల్టా వేరియంట్ కంటే శక్తివంతమైన వేరియంట్ వస్తే తప్పించి.. అంతగా ప్రభావం ఉండదనే అనుకుంటున్నాం. త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తే.. వైరస్ బారిన పడకుండా రక్షణ కలిగే వీలుంది.


Tags:    

Similar News