'పుచ్చకాయ' రాలేదు కానీ ఉగ్రవాదులు వస్తున్నారు.. పాక్ సైన్యంపై ఫైర్!

భారతదేశంలోకి తాను పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను పంపుతూ, సమస్యలు సృష్టించాలని, అశాంతిని నెలకొల్పాలని, పైగా.. భారత్ లోనే ఉగ్రవాదులు పెరిగిపోయారని ప్రపంచ వేదికలపై తప్పుడు ఆరోపణలు చేయాలని పాకిస్థాన్ నిత్యం ఉబలాటపడుతుందనే సంగతి తెలిసిందే.;

Update: 2026-02-09 17:11 GMT

భారతదేశంలోకి తాను పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను పంపుతూ, సమస్యలు సృష్టించాలని, అశాంతిని నెలకొల్పాలని, పైగా.. భారత్ లోనే ఉగ్రవాదులు పెరిగిపోయారని ప్రపంచ వేదికలపై తప్పుడు ఆరోపణలు చేయాలని పాకిస్థాన్ నిత్యం ఉబలాటపడుతుందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిత్యం రకరకాల ప్రయత్నాలు చేయడం.. భారత సైన్యం చేతిలో చావు దెబ్బ తినడం అలవాటుగా మారుచుకుంది! ఈ సమయంలో ఇప్పుడు ఆఫ్గాన్ నుంచి ఆ దేశంలోకి ఉగ్రవాదులు చొరబడుతున్నారనే టాపిక్ పై ఆ దేశ నాయకులే, ఆ సైన్యంపై విరుచుకుపడుతున్నారు.

అవును... చెరపకురా చెడేవు అని అంటారు. ఈ క్రమంలో.. భారత్ లోకి ఉగ్రవాదులను పంపి, రాక్షసానందం పొందే పాక్ కు పక్కలో బల్లెంలా తయారయ్యారు ఆఫ్గాన్ వైపు నుంచి వస్తోన్నారని చెబుతోన్న ఉగ్రవాదులు! ఈ సందర్భంగా స్పందించిన జమియ ఉలేమా-ఇ-ఇస్లాం (ఎఫ్) చీఫ్ మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్.. పాకిస్థాన్ ప్రభుత్వంపైనా, సైన్యం పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆఫ్గాన్ తీవ్రవాద సమస్యను నిర్వహించడంలో పాక్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని అన్నారు!

రావల్పిండిలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన ఫ్లజూర్ రెహ్మాన్... ఆఫ్గనిస్తాన్ నుంచి వాణిజ్యం నిరోధించబడినప్పటికీ ఉగ్రవాదులు మాత్రం వస్తూనే ఉన్నారని అన్నారు. ఆఫ్గాన్ తో వాణిజ్యం నిలిచిపోవడంతో అటువైపు నుంచి ఒక్క పుచ్చకాయ లేదా ఒక దానిమ్మ కూడా పాకిస్థాన్ లోకి ప్రవేశించలేదు కానీ... ఉగ్రవాదులు మాత్రం యదేచ్ఛగా సరిహద్దులు దాటుతూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో ఆఫ్గాన్ ప్రభుత్వం పాక్ సైన్యం చర్యలను ఎప్పుడూ అడ్డుచెప్పలేదని గుర్తుచేశారు!

ఇదే సమయంలో.. భారతదేశం తమ శత్రువని, ఆఫ్గాన్ తమ శత్రువని.. ఇరాన్, చైనా కూడా తమతో కలత చెందుతున్నాయని చెప్పిన రెహ్మాన్.. ఒక దేశం విధానాలు ఒంటరితనం, అపనమ్మకం, అభద్రతను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నప్పుడు మనుగడ సాగించలేవని నొక్కి చెప్పారు. ఇదే సమయంలో... అసలు పాకిస్థాన్ విదేశాంగ విధానాన్ని పౌర ప్రభుత్వం రూపొందించడం లేదని.. సైనిక వ్యవస్థ ద్వారానే రూపొందిస్తున్నరంటూ.. ఆ దేశ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ కు ఉమ్మడిగా చురకలంటించారు!

ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడిపై ఆఫ్గాన్ ఫైర్!:

పాకిస్థాన్ లో జరిగే బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులకు అటు ఢిల్లీనో, ఇటు కాబూల్ నో విమర్శించే అలవాటున్న పాకిస్థాన్... తాజాగా ఇస్లామాబాద్ శివారులో జరిగిన ఘోర ఆత్మాహుతి దాడుల విషయంలో ఆఫ్గాన్ పై విమర్శలు గుప్పించింది. దీంతో స్ట్రాంగ్ గా రియాక్ట్ అయిన కాబుల్... వారి అంతర్గత భద్రతా లోపాలకు ఆ దేశ అధికారులే బాధ్యత వహించాలి తప్ప.. తమపై బాధ్యతారాహిత్యమైన, నిరాధారమైన ఆరోపణలు చేయకూడని హితవు పలికారు.

కాగా... పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ శివారులో జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 70వరకూ మరణించారని స్థానిక మీడియా నివేదించగా.. 170 మందికి పైగా గాయపడ్డారని చెబుతున్నారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో నగర శివార్లలోని తర్లై ప్రాంతంలో ఈ దాడి జరిగింది! ఇది పాక్ లోని తీవ్ర అంతర్గత భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపుతుందని అంటున్నారు!

Tags:    

Similar News