విశాఖకు కొత్త భయం.. పేరు కయాంత్!

Update: 2016-10-26 05:55 GMT
రెండేళ్ల క్రితం హుద్‌ హుద్ తుపాను చేసిన గాయం ఇంకా మానకముందే మరోసారి పేరు మార్చుకుని మరో తుపాను దూసుకువస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే ఈ తుపానుకు అధికారులు కయాంత్ గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 685 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన కయాంత్ తీరంవైపు వేగంగా దూసుకొస్తుండడంతో విశాఖ వాసులు భయంతో వణికిపోతున్నారు.

తుపాను ప్రభావంతో గురువారం నుంచి ఆంధ్రప్రదేశ్ లో - శుక్రవారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇదే క్రమంలో ఓడరేవుల్లో కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇదే క్రమంలో మరోవైపు ఈనెల 29న విశాఖలో జరగాల్సిన భారత్-న్యూజిలాండ్ వన్డే మ్యాచ్‌ ను కూడా రద్దు చేయాలని అధికారులు భావిస్తున్నారట!!

గతంలో వచ్చిన హుద్‌హుద్ సమయంలో ప్రచండ వేగంతో వీచిన గాలులకు విశాఖ నగరం చిగురుటాకులా వణికిపోయిన సంగతి తెలిసిందే. ఆనాటి గాయం నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న విశాఖ వాసులకు కయాంత్ మరోసారి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తన ప్రతాపం చూపించిన అనంతరం ఈ నెల 29న ప్రకాశం జిల్లాలో తీరం దాటే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News