కేవీపీ స్ట్రాంగ్ కౌంటర్..టీడీపీ నేతలు దద్దమ్మలట

Update: 2019-05-19 05:45 GMT
సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోతున్నాయి. రేపటితో జరిగే చివరి దశ పోలింగ్ తో మొత్తం పోలింగ్ పూర్తి అయినట్టే. నిన్నటిదాకా ఎన్నికల ప్రచారం పేరిట నేతల మధ్య మాటల తూటాలు పేలితే... ఇప్పుడు ఫలితాలు ఎవరి పక్షాన నిలుస్తాయోనన్న ఆరాటంతో ఆ మాటల తూటాలకు మరింత పదునెక్కింది. ఏపీలో ఈ తరహా పరిస్థితి మరింత ఘాటుగా ఉందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పోలవరంపై తనను టార్గెట్ గా చేసుకుని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి స్నేహితుడు - కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ నేతలను దద్దమ్మలుగా అభివర్ణించిన కేవీపీ... పోలవరానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కేవీపీ రామచంద్రరావు.. ఏపీ మంత్రి దేవినేని ఉమ - ఇతర టీడీపీ నేతలు తనను విమర్శించడంపై తీవ్రంగా స్పందించారు. మరే జాతీయ ప్రాజెక్టుకు లేనివిధంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీని తాము తీసుకొచ్చామని చెప్పిన కేవీపీ... వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నప్పుడే అనుమతులు అన్నీ వచ్చేశాయని చెప్పారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టును ఆపాలనుకున్నా అది కుదరదని వ్యాఖ్యానించారు.

కేవీపీ వ్యాఖ్యలు ఎలా సాగాయంటే... ‘పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడం ఎవరితరమూ కాదు. ఎవరు ఎన్ని కేసులు వేసుకున్నా ప్రయోజనం ఉండదు. పోలవరం ప్రాజెక్టు ఖర్చంతా కేంద్రమే పెట్టుకోవాలని యూపీఏ ప్రభుత్వం 2014 ఏపీ పునర్విభజన బిల్లులో పెట్టింది. పోలవరం ప్రాజెక్టు అన్నది ఏపీ ప్రజల హక్కు. దాని నిర్మాణానికి కేంద్రం నిధులు విడుదల చేయాల్సిందే. కొందరు టీడీపీ నేతలు నేను పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడినట్లు చెబుతున్నారు. నేనెలా అడ్డుపడ్డానో వాళ్లంతా జవాబు ఇవ్వాలి. 2020లో కూడా కాఫర్ డ్యామ్ ద్వారా గ్రావిటీతోనే నీళ్లు అందించబోతున్నారు. మెయిన్ డ్యామ్ పనులు ఎప్పుడు పూర్తవుతాయో చంద్రబాబు ప్రభుత్వం చెప్పాలి. వీళ్ల చేతకానితనానికి ఇతరులను నిందిస్తే ఎలా? విజయవాడలో గత ఐదేళ్లుగా కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కట్టలేని దద్దమ్మలు అక్కడి ప్రజలను అష్టకష్టాలకు గురిచేస్తున్నారు. పోలవరానికి అన్ని అనుమతులు తీసుకొచ్చిన నన్ను బాధ్యుడిని చేసి విమర్శిస్తున్నారు’ అని కేవీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News