ధర్మానపై దువ్వాడ సంచలన ఆరోపణలు.. డైలమాలో వైసీపీ

తన రాజకీయ జీవితాన్ని ఇబ్బందుల పాల్జేస్తున్న ధర్మానను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలనని చెబుతున్న దువ్వాడ.. తాజాగా చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి.;

Update: 2025-12-16 16:30 GMT

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన భూకబ్జాకోరు అంటూ వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించడం సంచలనం సృష్టిస్తోంది. వ్యక్తిగత కారణాలతో దువ్వాడను వైసీపీ దూరం పెట్టినా.. ఆయన ఇప్పటికీ జగన్ భక్తుడిగానే కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ నేతపై దువ్వాడ ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పనిచేసిన ధర్మాన రాష్ట్రానికి రెండు సార్లు రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ఈ కాలంలో ఆయన విశాఖ, శ్రీకాకుళం, టెక్కలిల్లో భూకబ్జాలు చేశారని, ఆయన ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు అన్నీ వ్యక్తిగత ప్రయోజనం కోసమేనంటూ విమర్శలు గుప్పిస్తున్న దువ్వాడ వైసీపీలో పెద్ద రచ్చ రాజేశారంటున్నారు.

శ్రీకాకుళం జిల్లాకే చెందిన దువ్వాడకు తొలి నుంచి ఆ జిల్లాకు చెందిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుతో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. తన ఎదుగుదలను ధర్మాన అడ్డుపడుతున్నారనే ఆలోచనతో ఆయనను విభేదిస్తూ రాజకీయాలు చేస్తున్నారు దువ్వాడ. ఇక కొంతకాలం క్రితం దువ్వాడను వైసీపీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా ధర్మానే కారణమనే ప్రచారం కూడా ఉందని అంటున్నారు. ఈ కారణంగానే ధర్మానపై రగిలిపోతున్న దువ్వాడ.. తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు పలుమార్లు బహిరంగ ప్రకటనలు చేశారు.

తన రాజకీయ జీవితాన్ని ఇబ్బందుల పాల్జేస్తున్న ధర్మానను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలనని చెబుతున్న దువ్వాడ.. తాజాగా చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ధర్మాన రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై మాట్లాడిన ధర్మాన కూటమి ప్రభుత్వం పేద రైతులను ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు.

అయితే ధర్మాన చేసిన ఆరోపణల్లో ప్రజాకోణం లేదని, స్వీయ ప్రయోజనమే ఉందని దువ్వాడ ఆరోపించడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా విశాఖలో 70 ఎకరాలను కబ్జా పెట్టిన ధర్మాన ఆ భూముల రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ చెప్పడం గమనార్హం. అంతేకాకుండా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే టెక్కలిలో రూ.100 కోట్ల విలువైన స్వర్ణకారుల భూములను ధర్మాన కబ్జా చేశారని, అయితే తాను ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా 22ఏ లిస్టులో పెట్టించినట్లు వెల్లడించారు. ఇక శ్రీకాకుళం సమీపంలో రాగోలులో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ధర్మాన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనే విమర్శలు అగ్గిరాజేస్తున్నాయి.

వైసీపీ నుంచి బహిష్కరణకు గురైనా.. దువ్వాడ చేసిన ఆరోపణలను ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగానే చర్చించుకుంటున్నారు. దువ్వాడ సొంత నియోజకవర్గం టెక్కలితోపాటు కేంద్ర కార్యాలయంలోనూ దువ్వాడకు పార్టీ తరఫున ఎటువంటి ప్రోత్సాహం అందకపోయినా, ఆయన మాజీ సీఎం జగన్ అనుచరుడిగా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. దీంతో దువ్వాడపై సస్పెన్షన్ ను మీడియా సైతం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెబుతున్నారు. పలు అంశాలపై దువ్వాడ వాయిస్ తీసుకుంటున్న మీడియా.. కూటమికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడటాన్నే హైలెట్ చేస్తోంది. అదే సమయంలో మాజీ సీఎం జగన్ కు అనుకూలంగా దువ్వాడ మాట్లాడితేనే మీడియాలో ప్రాధాన్యం దక్కుతోందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నేత ధర్మానపై దువ్వాడ చేసిన ఆరోపణలతో వైసీపీ ఒత్తిడికి లోనవుతోందని అంటున్నారు.

Tags:    

Similar News