సీఎం గారే..ప్రభుత్వాన్ని రద్దు చేసేస్తారా?

Update: 2019-06-20 08:05 GMT
ఎలాగూ తమ ప్రభుత్వం నిలబడే అవకాశం లేదు కాబట్టి.. తామే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడం మేలని అనుకుంటున్నట్టుగా ఉన్నారు జేడీఎస్ వాళ్లు. ప్రస్తుతం ఈ ఆలోచనతోనే ఉన్నట్టుగా చెప్పారట దేవేగౌడ. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం  కథ అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ రాకపోయినా కాంగ్రెస్ - జేడీఎస్ లు  కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయినా ఉన్నది బోటాబోటీ మెజారిటీనే.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు అలకలు వహించినప్పుడల్లా ప్రభుత్వ మనుగడ పై చర్చ మొదలవుతూ ఉంది. అందుకే ఇటీవల మంత్రి వర్గ విస్తరణ కూడా చేశారు. అయితే దాని వల్ల వ్యవహారం  సెటిల్ కావడం సంగతలా ఉంచితే భారీ రచ్చ మాత్రం షురూ అయ్యింది.

మళ్లీ అసంతృప్తులు - అసమ్మతి మొదలైంది. దీంతో సంకీర్ణంలో లుకలుకలు  లేకుండా చేయడం ఎడతెగని అంశంగా మారుతూ ఉంది.  ఈ నేపథ్యంలో కుమారస్వామి ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆలోచనతో ఉన్నారట. అధికారం చేతిలో ఉంది కాబట్టి.. ఆ మేరకు సిఫార్సు చేసి  మధ్యంతర ఎన్నికలకు వెళ్లే  ఆలోచనతో ఉన్నారట. కర్ణాటక అసెంబ్లీకి సార్వత్రిక  ఎన్నికలు  పూర్తై  కనీసం ఏడాది కూడా పూర్తికాలేదు.

ప్రజలు అస్పష్టమైన తీర్పును ఇవ్వడంతో అక్కడ హంగ్ ఏర్పడి - ఇలాంటి రాజకీయం సాగుతూ ఉంది.  ఆఖరికి అధికారాన్ని అనుభవిస్తున్న వారికి కూడా ఆ వ్యవహారం విసుగుగానే మారినట్టుగా ఉంది!


Tags:    

Similar News