రూ.425కోట్ల ఇల్లు కొనేసిన బిజినెస్ టైకూన్‌

Update: 2015-09-08 08:56 GMT
ఎంత చెట్టుకు అంత‌గాలి అన్న‌ట్లు.. ఒక సాదాసీదా జీవికి ఒక గూడు ఉంటే అదే గొప్ప‌. ఒక మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవికి కాస్త ప్ర‌శాంతంగా ఉండే ఇల్లు కావాల‌నుకుంటాడు. ఇలా..ఎవ‌రి స్థాయికి త‌గ్గ‌ట్లు వారికి ఇంటి కోరిక‌లు మామూలే. సాదాజీవుల కోరిక‌లు కాస్త సింఫుల్ గా ఉంటాయి. కానీ.. బిజినెస్ టైకూన్  ల క‌ల‌లు.. ఐడియాలు పెద్ద‌విగా ఉంటాయి.

తాజాగా అలాంటి ఒక భారీ కోరిక‌ను ఒక ఇండియ‌న్ బిజినెస్ టైకూన్ తీర్చుకోనున్నారు. ముంబ‌యిలోని మ‌ల‌బార్ హిల్స్ లోని ఒక పే..ద్ద భ‌వంతిని కొనుగోలు చేసేందుకు సిద్ధ‌మైపోతున్నారు. భ‌వంతి కొనుగోలు చేయ‌టానికి అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు జ‌రిగిపోయాయ‌ని.. డీల్ ఓకేన‌ని.. అధికారికంగా చేతికి ఇల్లు రావ‌ట‌మే ఆల‌స్య‌మే త‌ప్పించి మిగిలిన ప‌నుల‌న్నీ అయిపోయిన‌ట్లుగా చెబుతున్నారు.

దేశంలో పేద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ల‌లో ఒక‌రైన ఆదిత్య బిర్లా గ్రూపు అధిప‌తి కుమార మంగ‌ళం బిర్లా ఈ బిల్డింగ్‌ ను కొనుగోలు చేసిన‌ట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఆయ‌న రూ.425కోట్లు ఖ‌ర్చు చేయనున్నారు. నిజానికి ఈ భ‌వ‌నం ఒక పారిశ్రామిక‌వేత్త కుటుంబానిద‌ని.. అయితే.. మారిన కాలంతో దాన్ని మొయింటైన్ చేయ‌టం ఆ కుటుంబానికి క‌ష్టం కావ‌టంతో దాన్ని అమ్మ‌కానికి పెట్టేశారంట‌.

ఈ భారీ భ‌వ‌నాన్ని సొంతం చేసుకోవ‌టానికి న‌లుగురైదుగురు బిజినెస్ మ్యాగ్నెట్స్ పోటీ ప‌డినా.. చివ‌ర‌కు ఆదిత్య బిర్లా మాత్రం ఈ భ‌వంతిని సొంతం చేసుకున్న‌ట్లేన‌ని చెబుతున్నారు. తుదిద‌శ చ‌ర్చ‌లు జ‌రిగినా.. అధికారికంగా ఇంటి సొంత‌దారు ఇంకా కాలేదంటున్నారు. డ‌బ్బులున్న మారాజు మ‌న‌సు ప‌డితే కానిది ఉంటుందా ఏమిటి..?
Tags:    

Similar News