అవన్నీ పూర్తి అయ్యాకనే కేటీఆర్ కు పట్టాభిషేకం

Update: 2021-01-26 03:30 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు త్వరలోనే పదవీ బాధ్యతల్ని అప్పజెప్పనున్నట్లుగా వార్తలు జోరుగా రావటం తెలిసిందే. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థ ఒక సంచలన కథనాన్ని అచ్చేసింది. ముఖ్యమంత్రి కుర్చీలో కేటీఆర్ ను కూర్చోబెట్టటం ఖాయమన్న విషయాన్ని చెబుతూనే.. అందుకు తగిన ముహుర్తం కోసం కొంతకాలం వెయిట్ చేయాలన్న విషయాన్ని వెల్లడించింది. పార్టీలో అంతర్గతంగా చోటు చేసుకుంటున్న పరిణామాలే.. కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్న యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.

అయితే.. అందుకు సరైన సమయం ఇప్పట్లో లేదని.. మంచి ముహుర్తాలు లేవంటున్నారు. యాదాద్రి ఆలయ ప్రారంభం.. రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు.. పట్టభద్రుల ఎన్నిక.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాకే కేటీఆర్ ను సీఎం చేసే అవకాశం ఉందంటున్నారు. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజుకాగా.. ఆ తర్వాతి రోజున అంటే ఫిబ్రవరి18న కేటీఆర్ సీఎంగా బాధ్యతలు చేపడతారన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నా.. అందులో నిజం పాళ్లు తక్కువేనంటున్నారు.

పలు పాలనాసంస్కరణలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్.. ప్రస్తుతం వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అవన్నీ పూర్తి కావటానికి మార్చి.. ఏప్రిల్ వరకు పడుతుందని.. ఆ తర్వాతే కేటీఆర్ కు సీఎం పీఠం దక్కే వీలుందన్న మాట వినిపిస్తోంది. త్వరలో రానున్న వరుస ఎన్నికలు (ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు.. వరంగల్.. నల్గొండ.. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక) వస్తున్న వేళ.. వాటిని పూర్తి చేశాకే అధికార బదిలీ ఉంటుందని చెబుతున్నారు. దీనికి తోడు ఇప్పట్లో మంచి ముహుర్తాలు కూడా లేకపోవటం కూడా.. ఈ ఏడాది ప్రధమార్థం వరకు ఆగాలన్న యోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News