జాతీయ మీడియా పొగడ్తలకు కేటీఆర్ తహతహ

Update: 2016-04-04 05:42 GMT
పేరు.. ప్రఖ్యాతుల కోసం రాజకీయ నాయకులు ఎంతలా ఆసక్తి ప్రదర్శిస్తారో తెలియంది కాదు. ఇక.. రాజకీయాల్లో ఉండే నేతల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైలేజీ వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు. అరుదైన ప్రయత్నం చేసి.. హాట్ టాపిక్ గా మారినప్పుడు ఇలాంటివి జాతీయ స్థాయిలో ఫోకస్ కావాలన్న భావన ఉంటుంది. కానీ.. అందుకు తగ్గ రీతిలో మీడియాలో కవరేజ్ రాకపోతే బాగానే ఫీలవుతారు. ఇప్పుడు అలాంటి ఫీలింగ్ లోనే ఉన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.

ఇటీవల తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యవహారంపై తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వటం.. మూడు గంటల పాటు సాగిన ఈ ప్రజంటేషన్ తరహాలో ఇప్పటివరకూ దేశంలో మరే సీఎం ఇవ్వని నేపథ్యంలో.. దీనిపై భారీ ప్రచారం వస్తుందని ఆశించారు. అయితే.. తెలుగు మీడియాలో భారీ కవరేజ్ ఇచ్చినా.. జాతీయ స్థాయిలో మాత్రం మీడియా ఈ విషయాన్ని పెద్దగా ఫోకస్ చేయలేదు.

దీనికి మంత్రి కేటీఆర్ విపరీతమైన అసంతృప్తి వ్యక్తమైనట్లు తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ చెప్పేసింది. తమ ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రజంటేషన్ ను జాతీయ మీడియా పట్టించుకోకపోవటాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘‘ఢిల్లీ సీఎం కూడా ఇలాంటి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి ఉంటే.. జాతీయ మీడియా నుంచి ఎన్నో ప్రశంసలు వచ్చేవి. ఒకసారి పరిశీలించండి. ఊరికనే గుర్తు చేస్తున్నా’’ అంటూ ట్వీటారు.

ఏదైనా పని చేసినప్పుడు ప్రశంసలే కాదు.. విమర్శలు కూడా ఉంటాయన్న విషయాన్ని కేటీఆర్ విస్మరిం చినట్లున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో  పొగడ్తలు మాత్రమే అలవాటైన కేటీఆర్ కు.. జాతీయ మీడియా కానీ ఏదైనా విషయాన్ని పట్టుకుంటే అన్ని కోణాల్లోనూ ఫోకస్ చేస్తుందన్న విషయాన్ని కేటీఆర్ మర్చిపోయినట్లున్నారు.
Tags:    

Similar News