'జగన్ మావిగన్'.. లోకేశ్ అదిరిపోయే రియాక్షన్
వైసీపీ కారణంగా ఏపీకి అమరావతికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కిపోయాయని, రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని మంత్రి లోకేశ్ ఆరోపించారు.;
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్లాన్ బిపై మంత్రి లోకేశ్ స్పందించారు. ప్లాన్ బి, ప్లాన్ సి అంటూ ఏవీ ఉండవని తేల్చిచెప్పారు. తమ ప్రభుత్వానిది ఒకటే ప్లాన్. అదే ప్లాన్ ఏ.. ప్లాన్ అమరావతి అంటూ స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి బదులుగా మావిగన్ ఏర్పాటు చేసి రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా మార్చాలన్న మాజీ సీఎం జగన్ సూచనలపై లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఐదేళ్ల పాలనలో కనీసం రోడ్లపై గుంతలను పూడ్చలేనివారు రాజధానిపై సలహా ఇస్తారా? అంటూ ధ్వజమెత్తారు.
మాజీ సీఎం జగన్ ప్లాన్ బి మావిగన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు మంత్రి లోకేశ్. ఢిల్లీలో ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడిన మంత్రి లోకేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై వివరణ ఇచ్చారు. వైసీపీని దృష్టిలో పెట్టుకుని, రైతుల ఆందోళనలను తీర్చడానికి రాజధాని అమరావతి శాశ్వతమని తేల్చిచెప్పడానికి చట్టం చేశామని వెల్లడించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని, పొరపాటున అధికారంలోకి వచ్చినా రాజధానిని టచ్ చేయని విధంగా చట్టం చేశామని తెలిపారు.
వైసీపీ కారణంగా ఏపీకి అమరావతికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కిపోయాయని, రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. రైతులు కూడా చాలా ఆందోళనతో ఉన్నారని, భవిష్యత్తులో మరో ఉద్యమం చేయలేమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని లోకేశ్ గుర్తు చేశారు. రైతుల ఆవేదన దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచి ఒక రోజంతా చర్చించి రాజధానిపై తీర్మానం చేశామన్నారు. ఈ క్రమంలో జగన్ ప్లాన్ బిపై మీడియా ప్రశ్నించగా, మంత్రి లోకేశ్ ఘాటుగా స్పందించారు.
అధికారంలో ఉండగా, వైజాగ్ ను రాజధానిని చేస్తామని చెప్పి ఒక ఇల్లు కూడా కట్టుకోలేకపోయారని మంత్రి లోకేశ్ విమర్శించారు. ఐదేళ్లలో ఒక రోడ్డు కూడా నిర్మించలేదని, రోడ్లపై కనీసం గుంతలు పూడ్చలేకపోయారని ఆరోపించారు. గుంతలు పూడ్చలేని వారు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సీ అనడమేంటని లోకేశ్ ప్రశ్నించారు. తమ వద్ద ఉన్నది ఒకటే ప్లాన్.. అదే ప్లాన్ ఏ, ప్లాన్ అమరావతి అంటూ స్పష్టం చేశారు. లోక్ సభలో అమరావతి చర్చ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మావిగన్ ప్రతిపాదన తీసుకువచ్చిన విషయం తెలిసిందే. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి రాజధాని రీజియన్ గా ప్రకటించాలని, దానికి మావిగన్ అంటూ పేరు పెట్టాలని జగన్ సూచించారు. దీంతో అప్పటి నుంచి రాజకీయంగా పెద్ద చర్చే జరుగుతోంది. ప్రధానంగా జగన్ వ్యాఖ్యలు అమరావతికి వ్యతిరేకంగా ఉన్నాయని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీనిపై తాజాగా లోకేశ్ కూడా స్పందించారు. జగన్ ఇకపై అమరావతిని ఏం చేయలేరని స్పష్టం చేశారని అంటున్నారు.