విజయసాయిరెడ్డి షాకింగ్ ట్వీట్.. జగన్ పై అదే విదేయత.. ఎంపీలపై ఫైర్

మీ పార్టీ అధ్యక్షుడిని తిడుతుంటే మీకు చీమ కుట్టినట్లు లేదా? అంటూ విజయసాయి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ పార్టీలోని తీవ్ర చర్చకు దారితీశాయి.;

Update: 2026-04-03 18:50 GMT

వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి శుక్రవారం చేసిన ట్వీట్ రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి చేసిన విమర్శలపై వైసీపీ ఎంపీలు స్పందించకపోవడం, మౌనంగా చూస్తూ ఉండిపోవడంపై విజయ్ సాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీ అధ్యక్షుడిని ఓ ఎంపీ నోరుపారేసుకుంటే వైసీపీ ఎంపీలకు చీమకుట్టినట్టైనా లేదా? అంటూ విజయసాయిరెడ్డి నిలదీసిన తీరు కొత్త చర్చకు తెరలేపిందని వ్యాఖ్యానిస్తున్నారు.

వైసీపీ అధినేత జగన్ విధానాలు నచ్చడం లేదని, కోటరీ చేతుల్లో బంధీ అయ్యారని, తనను పార్టీ నుంచి బయటకు పంపేలా పొగబెట్టారని జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. తాజా ట్వీట్ లో మాత్రం జగన్ పై అమితమైన ప్రేమాభిమానులు చూపిస్తున్నట్లు వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేణుకా మాట్లాడిన వీడియో గురువారం రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వైరల్ అయింది. రాజకీయ వర్గాల్లో రేణుకా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో విజయసాయిరెడ్డి సైతం రేణుకా మాట్లాడిన వీడియో క్లిప్ లింక్ ను షేర్ చేస్తూ వైసీపీ ఎంపీలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఎంపీల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విజయసాయి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘‘సాక్షాత్తు మీ వైసీపీ పార్టీ అధ్యక్షుడి పైన రాజ్యసభలో ఒక కాంగ్రెస్ ఎంపీ ఇలా నోరు పారేసుకుంటుంటే వైసీపీ ఎంపీ లకు చీమకుట్టినట్లైనా అనిపించలేదా? అడ్డుకోరా? ఖండించరా? మౌన ప్రేక్షకులైనారా?’’ అంటూ విజయసాయి చేసిన ట్వీట్ రాజకీయంగా ఆసక్తికర చర్చకు తెరలేపిందని అంటున్నారు. రాజ్యసభలో మాజీ సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి విరుచుకుపడ్డారు. ‘‘పెట్టరా పేరు అమరావతి, లేదంటే పిలవరా పేరు కమ్మరావతి’’ అంటూ తాను గతంలోనే చెప్పానని రాజ్యసభలో రేణుకా గుర్తు చేశారు. అమరావతి పేరుకు తాను మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే మాజీ సీఎం జగన్ పై రేణుక ఆ స్థాయిలో విరుచుకుపడినా వైసీపీ ఎంపీలు ఎవరూ పల్లెత్తి మాట్లాడలేదు. కనీసం ఆమె మాట్లాడుతున్న సమయంలో నిరసన వ్యక్తం చేయలేదు.

ఈ విషయాన్ని ఎత్తిచూపిన విజయసాయిరెడ్డి వైసీపీ ఎంపీల పనితీరుపై పెదవి విరిచారు. మీ పార్టీ అధ్యక్షుడిని తిడుతుంటే మీకు చీమ కుట్టినట్లు లేదా? అంటూ విజయసాయి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ పార్టీలోని తీవ్ర చర్చకు దారితీశాయి. అవును, నిజమే కదా, రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు ఉండగా, ఒక్కరు కూడా జగన్ పై రేణుకా చౌదరి విమర్శలు చేయడాన్ని అడ్డుకోలేదని గుర్తు చేస్తున్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయినా విజయసాయికి అధినేత జగన్ పై ప్రేమ తగ్గలేదని, ఆయన ఎత్తిచూపిన అంశాల్లో నిజం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

జగన్ పై విమర్శలను ఖండించరా? మౌన ప్రేక్షకులుగా మిగిలిపోతారా? అంటూ విజయసాయిరెడ్డి మండిపడటంపై పొలిటికల్ సర్కిల్స్ లో అనేక అనుమానాలకు కారణమవుతోంది. రాజకీయాలకు స్వస్తి అంటూ ప్రకటించిన విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీ వ్యవహారాలను నిశితంగా గమనించడం, అధినేతకు రక్షణ కవచంలా నిలబడే ప్రయత్నం చేస్తుండటంతో ఆయన మళ్లీ వైసీపీలోకి రీ ఎంట్రీ ఇస్తారా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News