అమరావతి దశలవారీగానే !

అమరావతి రాజధానికి లక్షల కోట్లు కావాలని కొందరు మాట్లాడుతున్నారని బాబు విమర్శించారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ ఇలాంటి వేర్వేరు ప్రాజెక్టులు నిర్మితం అవుతూనే ఉంటాయని బాబు చెప్పారు.;

Update: 2026-04-03 22:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ మీద తీవ్ర విమర్శలు మరోసారి చేశారు. ఈ రోజున ఏపీ అప్పుల్లో ఉండడానికి అలాగే దక్షిణాది రాష్ట్రాలలో ఏకంగా తలసరి ఆదాయంలో అతి తక్కువ స్థాయిలో ఉండడానికి కారణం అయిదేళ్ల వైసీపీ పాలనే అని అసలు విషయాలు చెప్పారు. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం పెట్టారు. ఈ సందర్భంగా మొత్తం తన ప్రసంగంలో వైసీపీ మీద జగన్ మీద పూర్తిగా విరుచుకుపడ్డారు. వైసీపీ లాంటి పార్టీల వల్లనే ఏపీలో ఎన్నో ఇబ్బందులు అని బాబు మండిపడ్డారు.

యాభై పార్టీలు ఒక వైపు :

లోక్ సభ రాజ్యసభలలో యాభైకి పైగా పార్టీలు అంతా ఒక వైపు ఉంటూ అమరావతి రాజధానికి తమ మద్దతుని పూర్తి స్థాయిలో తెలియచేశాయని ఆయన చెప్పారు. కేవలం వైసీపీ మాత్రం అక్కసుతో వ్యతిరేకించింది అని బాబు మండిపడ్డారు. జగన్ సూచనలతో వైసీపీ ఎంపీలు అమరావతికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని ఆయన ఫైర్ అయ్యారు.

దశలవారీగా :

అమరావతి నిర్మాణం దశలవారీగా జరుగుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రపంచ బ్యాంకు, హడ్కో, ఏడీబీ నుంచి ఫైనాన్షియల్ టై అప్ ఉందని అన్నారు. ప్రస్తుతం 56 వేల కోట్ల రూపాయల విలువైన పనులు రాజధానిలో జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. 2028 నాటికి రాజధానిలో ప్రధాన మైన పనులన్నీ ఓ కొలిక్కి వస్తాయని బాబు వెల్లడించారు. అదే సమయంలో అమరావతి రాజధాని నిర్మాణం ఒక్క రోజులో పూర్తి అయ్యేది కాదని బాబు స్పష్టం చేశారు. క్రమానుగతంగా జరుగుతుందని స్పష్టం చేశారు.

లక్షల కోట్లు అంటున్నారు :

అమరావతి రాజధానికి లక్షల కోట్లు కావాలని కొందరు మాట్లాడుతున్నారని బాబు విమర్శించారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ ఇలాంటి వేర్వేరు ప్రాజెక్టులు నిర్మితం అవుతూనే ఉంటాయని బాబు చెప్పారు. అలా క్రమానుగుణంగా రాజధాని నిర్మాణం అభివృద్ధి జరుగుతుందని బాబు వెల్లడించారు. అమరావతి రాజధానిలో కార్యకలాపాలు, ఆర్ధిక లావాదేవీలతోనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని బాబు చెప్పారు. హైదరాబాద్ ఒక్కటే తెలంగాణాలో గరిష్ట ఆదాయాన్ని ఆర్జించి పెడుతోందని ఆయన గుర్తు చేశారు. అమరావతిలో మౌలిక సదుపాయాల నిర్మాణం పూర్తి అయితే అభివృద్ధి ఆటో పైలట్ గా జరిగిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ మోడల్ లోనే అంతా :

ఎక్కడ చూసినా ప్రపంచంలోని వేర్వేరు ప్రాజెక్టులు ఈ మోడల్ లోనే అభివృద్ధి అయ్యాయని బాబు చెప్పారు. ఇక 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు. అలా దానికి చోదకశక్తిగా అమరావతి నిలుస్తుందని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు అన్నీ 2029లో ప్రధాని మోదీతో ప్రారంభింపచేస్తామని బాబు అన్నారు.

సెల్ఫ్ ఫైనాన్సియల్ సిటీగా :

నూరు శాతం అమరావతి సెల్ఫ్ ఫైనాన్షియల్ సిటీగా ఉంటుందని బాబు చెప్పారు. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు అవసరం లేదని అన్నారు. అమరావతి లో నిర్మాణాలు ఒక కొలిక్కి వచ్చాక అభివృద్ధి ఊపు అందుకుంటుందని బాబు విశ్వాసం వ్యక్తం చేసారు. మొత్తం మీద అమరావతి రాజధాని విషయంలో బాబు అయితే పూర్తి ధీమాని చూపిస్తూనే ఏపీలో ఆర్ధిక పరిస్థితులను సైతం వివరించారు. అయినా సరే రాజధాని అనుకున్న తీరున నిర్మాణం జరుగుతుందని ఆయన అంటున్నారు.

Tags:    

Similar News