₹931 కోట్ల అమెరికా ఫైటర్ జెట్‌.. సౌదీలో యూఎస్ రాడార్.. ఇరాన్ ధాటికి కకావికలం

ఇరాన్ దాడులు కేవలం సౌదీ అరేబియాకే పరిమితం కాలేదు. గల్ఫ్ ప్రాంతంలోని ఇతర దేశాల్లో ఉన్న అమెరికా రక్షణ వలయాలను కూడా ఇరాన్ తుత్తినియలు చేస్తోంది.;

Update: 2026-04-03 19:30 GMT

పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు అంతకంతకూ ఎగసిపడుతున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు ప్రత్యక్ష దాడుల దిశగా మలుపు తిరిగింది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన, అత్యాధునిక సైనిక సంపత్తిని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ వరుస దాడులకు తెగబడుతుండటం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికా గర్వకారణంగా భావించే యుద్ధ విమానాలు, రాడార్ వ్యవస్థలు ధ్వంసమవుతున్నాయన్న వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

ఎఫ్-35 ఫైటర్ జెట్ కూల్చివేత.. ఇరాన్ సంచలన ప్రకటన

అమెరికా వైమానిక దళంలో అత్యంత శక్తివంతమైనదిగా పేరుగాంచిన F-35 ఫైటర్ జెట్‌ను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా కూల్చివేసినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. సెంట్రల్ ఇరాన్ మీదుగా ప్రయాణిస్తున్న ఈ విమానాన్ని క్షిపణుల ద్వారా నేలకూల్చామని, దీనికి సంబంధించిన ఫోటోగ్రాఫిక్ ఆధారాలను కూడా టెహ్రాన్ విడుదల చేసింది.

ఒక్కో ఎఫ్-35 జెట్ విలువ సుమారు ₹931 కోట్లకు పైమాటే.

కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే అంటే మార్చి 19న కూడా ఒక ఎఫ్-35ను కూల్చేశామని ఇరాన్ వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలపై అగ్రరాజ్యం అమెరికా ఇప్పటివరకు పెదవి విప్పకపోవడం గమనార్హం.

ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై దాడి.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ

గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ తన ప్రతీకార దాడులను తీవ్రం చేసింది. సౌదీ అరేబియాలోని కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్ లక్ష్యంగా జరిగిన దాడి అమెరికాకు కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడిలో అమెరికాకు చెందిన అత్యంత కీలకమైన ఏఎన్ టీపీవై -2 రాడార్ వ్యవస్థ తీవ్రంగా ధ్వంసమైందని తాజా శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

ఎందుకు ఈ రాడార్ ముఖ్యం?

ఈ రాడార్ అమెరికా యొక్క టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ క్షిపణి నిరోధక వ్యవస్థలో గుండెకాయ వంటిది. శత్రువుల బాలిస్టిక్ క్షిపణులు, అత్యాధునిక డ్రోన్లను సెకన్ల వ్యవధిలో గుర్తించి హెచ్చరించే సామర్థ్యం దీనికి ఉంది. దీని అభివృద్ధి కోసం అమెరికా సుమారు 136 మిలియన్ డాలర్లు వెచ్చించింది. మార్చి 1న జరిగిన ఈ దాడిలో కేవలం రాడార్ మాత్రమే కాకుండా అక్కడ ఉన్న ఒక ఈ-3 ఎయిర్‌క్రాఫ్ట్, ఇంధన రీఫ్యూయెలింగ్ ట్యాంకర్ కూడా ఆహుతయ్యాయి. ఈ ఘటనలో 10 మంది అమెరికా సైనికులు గాయపడినట్లు సమాచారం. మార్చి 29న విడుదలైన ఉపగ్రహ చిత్రాలు ఈ భారీ నష్టాన్ని కళ్లకు కట్టాయి.

గల్ఫ్ దేశాల్లో విస్తరిస్తున్న అలజడి

ఇరాన్ దాడులు కేవలం సౌదీ అరేబియాకే పరిమితం కాలేదు. గల్ఫ్ ప్రాంతంలోని ఇతర దేశాల్లో ఉన్న అమెరికా రక్షణ వలయాలను కూడా ఇరాన్ తుత్తినియలు చేస్తోంది. ఇక్కడి అమెరికా స్థావరంలో ఉన్న మరో ఏఎన్ టీవై-2 రాడార్‌ను ఇరాన్ ధ్వంసం చేసినట్లు నివేదికలు అందుతున్నాయి. ఖతార్‌లోని ఎర్లీ వార్నింగ్ రాడార్ వ్యవస్థ కూడా ఈ దాడుల ప్రభావానికి గురైంది. ఈ వ్యవస్థను పునర్నిర్మించాలంటే దాదాపు 100 కోట్ల డాలర్లు (బిలియన్ డాలర్లు) ఖర్చవుతుందని అంచనా.

వ్యూహాత్మక యుద్ధం దిశగా..

ఇరాన్ చేస్తున్న ఈ దాడులు కేవలం ఆవేశంతో చేస్తున్నవి కావని.. అమెరికా యొక్క "కళ్లు, చెవులుగా" భావించే నిఘా, రాడార్ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం ద్వారా వారి రక్షణ కవచాన్ని ఛేదించడమే ఇరాన్ ప్రధాన వ్యూహమని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అగ్రరాజ్యం సైనిక సత్తాకే ఇరాన్ సవాలు విసురుతుండటంతో గల్ఫ్ ప్రాంతం ఏ క్షణమైనా పెను యుద్ధానికి దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ముఖ్యంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Tags:    

Similar News