ప్రస్తుత పరిస్థితిలో 'ఆ ఒక్కటే' లోటు.. !
ఈ క్రమంలో రాజధాని అమరావతికి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో సినీ రంగంనుంచి ప్రశంసలు వస్తాయని భావించారు.;
అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం లభించింది. ఇక, రాష్ట్రపతి సంత కంతో ఈ బిల్లు చట్టంగా మారనుంది. ఈ క్రమంలో పారిశ్రామిక వర్గాల నుంచి రైతు సంఘాల దాకా.. ఎన్నారైల నుంచి సాధారణ పౌరుల దాకా.. ఈ విషయంపై ప్రశంసలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్న చర్చ కూడా జరు గుతోంది. ముఖ్యంగా నాడు అమరావతికి బీజం వేసిన చేత్తోనే.. చంద్రబాబు దానికి కట్టుదిట్టమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారని అందరూ కొనియాడుతున్నారు.
అయితే.. ఈ సమయంలో అందరూ ఎదురు చూసే సినీ రంగం మాటేంటి? అనేదే!. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగినా.. వెంటనే సినీ రంగం స్పందన కోసం ప్రజలు, ప్రభుత్వాలు కూడా వేచి చూస్తాయి. వారు స్పందిస్తే.. పప్పులో ఉప్పు ఉన్నంత భావన కలుగుతుంది. వర్షాలు..వరదలు వచ్చినా.. సినీరంగం ఆపన్నహస్తం కోసం చూస్తారు. రాష్ట్రంలో ఏదైనా ఘనకార్యంజరిగినావారి మెప్పు ఆశిస్తారు. దీనికి కారణం.. ప్రజలకు సినీ రంగానికి.. రాజకీయాలకు సినీరంగానికి మధ్య ఏర్పడిన అవినాభావసంబంధం. ఎన్నికల వేళలో సినీమా హీరోలను ప్రోజెక్టు చేసుకునేది అందుకే.
ఈ క్రమంలో రాజధాని అమరావతికి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో సినీ రంగంనుంచి ప్రశంసలు వస్తాయని భావించారు. కొందరు ఎదురు కూడా చేశారు. అయితే.. దర్శకుడు బోయపాటి శ్రీను మినహా.. ఇప్పటి వరకు ఎవరూ స్పందించ లేదు. వాస్తవానికి గతంలో అమరావతిపై వైసీపీ యుద్ధం చేసినప్పుడు.. రైతులను హించినప్పుడు.. సినీ నిర్మాత అశ్వినీదత్, నటుడు మురళీమోహన్(మాజీ ఎంపీ కూడా) స్పందించారు. కానీ, ఈ దఫా వీరు ఎవరూ స్పందించలేదు. రాజధానిలో జరుగుతున్న కార్యక్రమాలను నిశితంగా గమనిస్తున్నామని చెప్పుకొనే వారు కూడా ఇప్పుడు మౌనంగా ఉండడం గమనార్హం.
దీనికి కారణాలు ఏంటనేది తెలియదు కానీ.. సినీ రంగంలో నిజానికి పెద్దనిర్మాతలు, నిర్మాణ సంస్థలుగాఉన్నవి.. ఏపీ మూలాల నుంచే అన్నదిఅందరికీ తెలిసింది. ``దగ్గుబాటి నుంచి అల్లు వరకు.. అశ్వినీదత్ కూడా.. ఏపీకి చెందిన వారే. ఇక, అక్కినేని కుటుంబం కూడా.. కృష్ణాజిల్లాకు చెందిన ఫ్యామిలీనే. మరి ఇంత మంది ఉన్నా.. ఒక్కరు కూడా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందితే.. కిమ్మనలేదంటే.. ఆశ్చర్యం వేస్తంది.`` అని ఓ పొలిటికల్ అనలిస్టు వ్యాఖ్యానించారు. రేపు రాజధాని కడితే.. మొట్ట మొదట ఇక్కడ బిజినెస్ చేసుకునే వారేనని ఆయన చెప్పుకొచ్చారు.