త‌ల‌సాని గెలిస్తే... కేటీఆర్ కు అసంతృప్తి ఎందుకో?

Update: 2019-01-02 15:03 GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిశాయి. అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ... గులాబీ ద‌ళ‌ప‌తి, టీఆర్ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు సంచ‌ల‌న ఫ‌లితాల‌ను సాధించారు. కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన టీఆర్ఎస్‌... తెలంగాణ‌లో జ‌రిగిన తొలి ఎన్నిక‌ల్లో వ‌చ్చిన సీట్ల కంటే కూడా మెరుగైన ఫ‌లితాల‌ను సాధించి ఏకంగా 88 సీట్ల‌లో విజ‌య కేతనం ఎగుర‌వేసింది. టీడీపీ, కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు, తెలంగాణ జ‌న‌స‌మితి క‌లిసిక‌ట్టుగా మ‌హా కూట‌మిగా పోటీ చేసినా కూడా కేసీఆర్‌ను ఏమీ చేయ‌లేక‌పోయారు. కేసీఆర్ గ‌ద్దె దిగ‌డం ఖాయ‌మంటూ ఆంధ్ర ఆక్టోప‌స్‌గా పేరొందిన ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ వెలువ‌రించిన స‌ర్వేను కూడా గ‌ల్లంతు చేసిన తెలంగాణ ఓట‌ర్లు... గులాబీ పార్టీకి బంప‌ర్ మెజారిటీ ఇచ్చారు. ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత టీఆర్ఎస్ సంబ‌రాలు చేసుకుంటూ ఉంటే... మ‌హా కూట‌మిలోని పార్టీల‌కు చెందిన నేత‌లంతా అడ్రెస్ లేకుండా పోయారు. మొత్తంగా ఇంకో ఐదేళ్ల దాకా గులాబీ పార్టీకి తిరుగులేదు.

అయితే ఎన్నిక‌ల్లో త‌మ ఓట‌మికి ఓట్ల గ‌ల్లంతేన‌ని కాంగ్రెస్ లాంటి పార్టీలు ఆరోప‌ణ‌లు గుప్పించాయి. వాస్త‌వానికి ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌ల‌ను ఖండించాల్సిన అధికార పార్టీ... ఓట్ల గ‌ల్లంతు వాస్తవ‌మేన‌ని, అయితే ఆ ఓట్ల గ‌ల్లంతుతో విప‌క్షాల‌తో పాటు త‌మ పార్టీ కూడా భారీగానే న‌ష్ట‌పోయింద‌ని టీఆర్ఎస్ వాదిస్తోంది. ఇప్ప‌టికే ఈ త‌ర‌హాలో చాలా సంద‌ర్భాల్లో మాట్లాడిన టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు... తాజాగా మ‌రోమారు ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. కేవ‌లం ఓట్ల గ‌ల్లంతును మాత్ర‌మే ప్ర‌స్తావించి వ‌దిలేయ‌ని కేటీఆర్‌... ఓ ఆస‌క్తిక‌ర అంశాన్ని కూడా చెప్పారు. ఓట్ల గ‌ల్లంతుతో జంట న‌గ‌రాల ప‌రిధిలో త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌కు ఆశించిన మేర మెజారిటీ రాలేద‌ని ఆయ‌న ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేటి మ‌ధ్యాహ్నం హైద‌రాబాదులోని జ‌ల విహార్‌లో స‌న‌త్ న‌గ‌ర్ టీఆర్ఎస్ కార్యక‌ర్త‌ల స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి హాజ‌రైన కేటీఆర్‌ నోట నుంచి ఓ బాంబు లాంటి మాట వెలువ‌డింది. స‌న‌త్ న‌గ‌ర్ నుంచి త‌మ పార్టీ అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగిన త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ గెలుపు త‌న‌కు అసంతృప్తి క‌లిగించింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

పార్టీ అభ్య‌ర్థి గెలిస్తే... సతోషించాల్సింది పోయి అసంతృప్తి క‌లిగించింద‌ని చెప్ప‌డ‌మేంట‌ని కార్య‌క‌ర్త‌లంతా ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. అయితే త‌ల‌సాని గెలుపు ఏ విష‌యంలో త‌న‌ను అసంతృప్తికి గురి చేసింద‌న్న విష‌యాన్ని కేటీఆర్ ఆ త‌ర్వాత చెప్ప‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఓట్ల గ‌ల్లంతు కార‌ణంగా త‌ల‌సానికి రావాల్సిన మెజారిటీ రాలేద‌న్న కోణంలోనే కేటీఆర్ ఆ వ్యాఖ్య చేశార‌ని కార్య‌క‌ర్త‌లు ఆ త‌ర్వాత అర్థం చేసుకున్నారు. ఓట్ల గ‌ల్లంతు లేక‌పోయి ఉంటే... త‌ల‌సాని 75 వేల నుంచి 85 వేల మెజారిటీతో గెలిచార‌ని, ఓట్లు గ‌ల్లంతు కావ‌డంతో త‌ల‌సాని స్వ‌ల్ప మెజారిటీనే వ‌చ్చింద‌ని కేటీఆర్ చెప్పారు. త‌ల‌సాని స్వ‌ల్ప మెజారిటీతోనే విజ‌యం సాధించడం త‌న‌కు నిజంగానే అసంతృప్తి క‌లిగింద‌ని కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. మొత్తంగా విప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను తాను కూడా మ‌ద్ద‌తు పలుకుతూ... త‌న‌దైన శైలిలో త‌న పార్టీ ఏ మేర న‌ష్ట‌పోయిందో, త‌న పార్టీ అభ్యర్థులు ఏ మేర మెజారిటీలు పోగొట్టుకున్నార‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించిన కేటీఆర్ నిజంగానే ఓట్ల గ‌ల్లంతును కూడా త‌న‌కు అనుకూలంగా మ‌లిచేసుకున్నార‌న్న మాట‌.
Tags:    

Similar News