భారత్‌లో 'బేబీ బస్ట్'.. ముంచుకొస్తున్న ముప్పు!

జననాల రేటు తగ్గిపోతే ఆ ప్రభావం కేవలం విద్యా రంగానికే పరిమితం కాదని అంటున్నారు. భవిష్యత్తులో పని చేసే యువశక్తి తగ్గిపోయి, వృద్ధుల సంఖ్య పెరిగితే దేశ ఆర్థిక చక్రం కుంటుపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.;

Update: 2026-04-07 15:30 GMT

ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఆవిర్భవించిన భారత్, రాబోయే కొన్నేళ్లలోనే అతిపెద్ద సవాల్ ఎదుర్కోబోతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొద్దికాలంలో భారత్ వృద్ధుల దేశంగా మారిపోయే పరిస్థితి భయపెడుతోంది. ఒకప్పుడు 'జనాభా విస్ఫోటనం' శాపమని భావించిన మన దేశంలో ఇప్పుడు జననాల తగ్గుదల అంతకంటే పెద్ద సంక్షోభానికి దారితీస్తోందని చెబుతున్నారు. ఆధునిక జీవనశైలి, ఆర్థిక స్థితిగతులు, యువత ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులతో సంతానోత్పత్తి రేటు భారీగా తగ్గడానికి కారణమవుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో 'ఒక్కరే చాలు' అనే ధోరణి పెరగడం, ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం వంటివి జనాభా సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని అంటున్నారు.

దేశంలో జననాల రేటు భారీగా తగ్గుతోంది. దీని ప్రభావం ఇప్పటికే విద్యా వ్యవస్థపై కనిపిస్తోందని చెబుతున్నారు. ఇక ఏపీలో జననాల సంఖ్య తగ్గడంతో పాఠశాలలో చేరుతున్న పిల్లల సంఖ్య కూడా తగ్గుతున్న గణాంకాలు సూచిస్తున్నాయి. గత దశాబ్దంలో ఏటా పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చేది. అయితే ఇప్పుడు పరిస్థితి రివర్స్ ట్రెండులో కనిపిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం ఏటా పాఠశాలలో చేరికలు తగ్గిపోతున్నాయి. ప్రీప్రైమరీ నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్యపై ఇటీవల రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానం దేశంలో జననాల రేటు ఆందోళనకరంగా ఉన్నట్లు సూచిస్తోంది.

2024-25లో దేశంలో 83,44,988 మంది విద్యార్థులు ఉంటే ఆ సంఖ్య 2025-26 విద్యాసంవత్సరానికి దాదాపు 16 వేల వరకు తగ్గింది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే వచ్చే కొన్నేళ్లలో పిల్లల సంఖ్య తగ్గిపోయి, దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితి నివారించడానికి ప్రభుత్వం ముందుగానే మేల్కొని జనాభా మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే రకమైన ఆలోచనతో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేశారు. ముగ్గురు పిల్లలను కనమని ప్రోత్సహిస్తున్నారు. కానీ, ఆధునిక ఆలోచనలతో యువత అందుకు సిద్ధంగా లేనట్లు చెబుతున్నారు.

జననాల రేటు తగ్గిపోతే ఆ ప్రభావం కేవలం విద్యా రంగానికే పరిమితం కాదని అంటున్నారు. భవిష్యత్తులో పని చేసే యువశక్తి తగ్గిపోయి, వృద్ధుల సంఖ్య పెరిగితే దేశ ఆర్థిక చక్రం కుంటుపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. జపాన్, చైనా వంటి దేశాలు ఇప్పటికే ఈ 'డెమోగ్రాఫిక్ క్రైసిస్'ను ఎదుర్కొంటున్నట్లు ఉదహరిస్తున్నారు. భారత్ కూడా అదే బాటలో పయనిస్తోందా అనే చర్చ ఇప్పుడు తీవ్ర ఆందోళనకు దారితీస్తోందని చెబుతున్నారు. దేశంలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) లెక్కల ప్రకారం సంతానోత్పత్తి రేటు 2.1 కంటే తక్కువకు పడిపోయిందని చెబుతున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే, రాబోయే రెండు మూడు దశాబ్దాల్లో భారతదేశం 'వృద్ధుల దేశం'గా మారే ప్రమాదం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News