ప్రధానిగా మమతా దీదీ...నిజమేనా ?
ఈ దేశంలో మహిళా ప్రధానమంత్రిగా ఏకైక నాయకురాలు శ్రీమతి ఇందిరా గాంధీ ఉండేవారు.;
ఈ దేశంలో మహిళా ప్రధానమంత్రిగా ఏకైక నాయకురాలు శ్రీమతి ఇందిరా గాంధీ ఉండేవారు. ఆమె ఐరన్ లేడీగా బలమైన ముద్ర వేసుకున్నారు. 1966 నుంచి 1977 దాకా ఏకంగా 11 ఏళ్ళ పాటు కంటిన్యూస్ గా దేశాన్ని పాలించిన ఇందిర బలమైన నాయకురాలిగా జాతీయంగా అంతర్జాతీయంగా ఎదిగారు. ఇక 1980 నుంచి 1984లో మరణించేంతవరకు మరో అయిదేళ్ల పాటు ప్రధానిగా పాలించారు. మొత్తంగా 16 ఏళ్ల పాటు దేశాన్ని ఇందిరాగాంధీ ఏలారు. ఆమె తరువాత మరో మహిళ ఈ దేశంలో ప్రధాని పీఠం ఎక్కలేదు. అయితే ఇపుడు ఒక మహిళా నేత పేరు ఈ పదవి కోసం గట్టిగా వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు బెంగాల్ ప్రజల చేత దీదీ అని పిలిపించుకుని ముమ్మారు పశ్చిన బెంగాల్ కి ముఖ్యమంత్రిగా పనిచేసి వరుసగా నాలుగవ సారి గెలిచి రికార్డు బద్ధలు కొట్టాలని చూస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.
సంచలన వ్యాఖ్యలతో :
బెంగాల్ లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత అభిషేక్ బెనర్జీ ఒక సభలో మాట్లాడుతూ పాకిస్తాన్ ని ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. కోల్ కటా మీదకు వస్తామని ఇళ్లలో దాడి చేస్తామని పాక్ పాలకులు అంటున్నారని కానీ తామే పాకిస్తాన్ మీదకు వెళ్ళి వారి సంగతి తేలుస్తామని వార్నింగ్ ఇచ్చారు. మమతా బెనర్జీ ఇండియా కూటమి తరఫున కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఇది తప్పకుండా జరుగుతుందని ఆయన స్పష్టంగా చెప్పారు. దీనిని బట్టి చూసిన వారు మమత ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా ముందుకు వస్తున్నారా అన్న చర్చిస్తున్నారు.
గెలిస్తే ఢిల్లీకే :
ఇక మూడు సార్లు బెంగాల్ సీఎం గా ఉన్న మమత 2026 ఎన్నికల్లో కనుక గెలిస్తే 2029 నాటికి ఆమె జాతీయ రాజకీయాల్లోకి వస్తారు అన్న చర్చ సాగుతోంది. మమత చూపు అపుడు ఢిల్లీ మీదనే ఉంటుందని అంటున్నారు. ఆ మాటకు వస్తే చాలా కాలంగా మమత జాతీయ రాజకీయల మీద ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. ఇక ఇండియా కూటమిలో కాంగ్రెస్ పెద్ద పార్టీగా ఉంది. ఆ తరువాత తృణమూల్ కాంగ్రెస్ ఉంటుంది. అందులో మరో బలమైన పార్టీగా డీఎంకే ఉన్నా కూడా సీనియారిటీ అనుభవం అన్నీ కలసి మమత ఇండియా కూటమి నాయకత్వాన్ని కోరుకుంటారు అని అంటున్నారు. బెంగాల్ లో విజయం తరువాత ఆమె ఇండియా కూటమి బాధ్యతలు తీసుకుని మోడీ సర్కార్ మీద గట్టిగా పోరాడుతారు అని అంటున్నారు.
మహిళా రిజర్వేషన్ తో :
ఇక మహిళా రిజర్వేషన్ అన్నది 2029 ఎన్నికల్లో గెలిచేందుకు తమ పార్టీకి ట్రంప్ కార్డు అవుతుందని బీజేపీ భావిస్తోంది కానీ అదే సమయంలో దేశంలో లోక్ సభ సీట్లు 840 దాకా పెరిగితే మాత్రం అందులో మూడవ వంతు మహిళా ఎంపీలే ఉంటారు అన్నది మరచిపోరారు. అలా లెక్క తీస్తే 280 దాకా ఎంపీ సీట్లు మహిళలకు దఖలు పడతాయి. దాంతో మహిళలు కూడా ప్రధాని పీఠం మీద గురి పెట్టేందుకు అవకాశాలు అధికం అవుతాయని అంటున్నారు. ఇక ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా లీడ్ తీసుకుని బీజేపీ మీద పోరాటానికి మమత సిద్ధం అవుతారు అని అంటున్నారు.
ఇండియా కూటమి నుంచి రేసులో :
ఆ విధంగా డైనమిక్ లీడర్ షిప్ ని ఆమె ఇస్తారని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు అంటున్నారు. మమత తరువాత కీలక హోదాలో పార్టీలో ఉన్న అభిషేక్ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు అంటే మమత కచ్చితంగా కాబోయే ప్రధానిగా ఇండియా కూటమి నుంచి రేసులో ఉంటారు అన్నది స్పష్టం అవుతోంది. ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు ఉంటే ఇండియా కూటమి సారధ్యం ఆమెకు దక్కడం కూడా కష్టమేమీ కాదు, మొత్తానికి ఇవన్నీ ఆలోచించే అభిషేక్ బెనర్జీ ఈ కామెంట్స్ చేసి ఉంటారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.