రేవంత్ కు కేరళ సీఎం లేఖ.. ఆ విమర్శలపై ఫైర్ అయిన నేత..
ముఖ్యమంత్రుల స్థాయి వ్యక్తులు పరస్పరం విమర్శలు చేసుకునేటప్పుడు గౌరవప్రదమైన భాషను వాడడం అవసరం.;
రాజకీయాల్లో విమర్శలు సహజమే.. కానీ అవి వ్యక్తిగత స్థాయికి వెళ్తే మాత్రం ప్రత్యక్ష యుద్ధం వరకు వెళ్లవచ్చు.. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు దక్షిణాది రాజకీయాల్లో చిచ్చు రేపాయి. సాధారణంగా సౌమ్యంగా కనిపించే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, రేవంత్ వ్యాఖ్యలపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఒక సుదీర్ఘ లేఖ రాస్తూ రేవంత్ ఆరోపణలను తిప్పికొట్టడమే కాకుండా, తన రాష్ట్రం సాధించిన ఘనతలను ఏకరువు పెట్టారు. అసలు రేవంత్ ఏమన్నారు..? విజయన్ అంత ఘాటుగా ఎందుకు స్పందించాల్సి వచ్చింది? ఆ లేఖలోని అసలు విషయాలేంటో చూద్దాం..
వ్యక్తిగత విమర్శలపై ఆగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేరళ సీఎం విజయన్ ఘాటుగా స్పందించారు. ‘మన మధ్య పొలిటికల్ విభేదాలు ఉండొచ్చు, సిద్ధాంత పరమైన పోరాటాలు జరగొచ్చు.. కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ సంస్కృతి కాదు, వాటిని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా’ అని విజయన్ స్పష్టం చేశారు. రేవంత్ చేసినవి నిరాధార ఆరోపణలని, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.
నీతి అయోగే సాక్షి
రేవంత్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలకు విజయన్ గణాంకాలతో సమాధానం చెప్పారు. దేశంలోనే అతితక్కువ అవినీతి కలిగిన రాష్ట్రంగా కేరళను నీతి అయోగ్ గుర్తించిందని గుర్తు చేశారు. తమ పాలన పారదర్శకంగా ఉంటుందని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని లేఖలో కొసరు వేశారు. కేరళ మోడల్ అభివృద్ధిని విమర్శించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని హితవు పలికారు.
కరవుపై రికార్డు..
కేరళ సాధించిన మరో చారిత్రాత్మక ఘనతను విజయన్ ప్రస్తావించారు. 2025, నవంబర్ 1 నాటికి కరవును పూర్తిగా జయించిన తొలి రాష్ట్రంగా కేరళగా నిలిచిందని ఆయన గర్వంగా ప్రకటించారు. వ్యవసాయ రంగంలో తాము తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల వల్లే ఇది సాధ్యమైందని, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడడంలో కేరళ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు.
బీజేపీపై పోరాటం
బీజేపీ విషయంలో రేవంత్ చేసిన విమర్శలను విజయన్ తోసిపుచ్చారు. ‘బీజేపీపై మాకేమీ ప్రత్యేకమైన ప్రేమ లేదు. ఆ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటంలో మేము ఎప్పుడూ ముందుంటాం. ఆ పార్టీపై పోరాటానికి అందరం కలిసి ఉమ్మడి వేదికగా నిలవాల్సిన అవసరం ఉంది’ అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల మధ్య అనవసరమైన ధూషణలు ఉంటే అది అంతిమంగా బీజేపీకే లాభిస్తుందని హెచ్చరించారు.
ముఖ్యమంత్రుల స్థాయి వ్యక్తులు పరస్పరం విమర్శలు చేసుకునేటప్పుడు గౌరవప్రదమైన భాషను వాడడం అవసరం. కేరళ సీఎం రాసిన ఈ లేఖ ద్వారా తన రాష్ట్ర గౌరవాన్ని కాపాడుకోవడంతో పాటు.., రేవంత్ రెడ్డికి రాజకీయ పాఠం చెప్పినట్లయ్యింది. భవిష్యత్తులో ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో, ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో వేచి చూడాలి. ఏదేమైనా, అభివృద్ధి విషయంలో రాష్ట్రాల మధ్య పోటీ ఉండాలి కానీ, ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.