వెల్లంపల్లికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ?

వైసీపీలో మూడేళ్ల పాటు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఉమ్మడి క్రిష్ణా జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉంటున్నారు.;

Update: 2026-04-07 18:36 GMT

వైసీపీలో మూడేళ్ల పాటు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఉమ్మడి క్రిష్ణా జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉంటున్నారు. ఆయన రాజకీయ జీవితం ప్రజారాజ్యం పార్టీ ద్వారా స్టార్ట్ అయింది. 2009లో ఆయన చిరంజీవి ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తొలి ప్రయత్నంలోనే గెలిచారు. ఇక 2014లో మాత్రం ఆయన బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నా వైసీపీ చేతిలో ఓటమి పాలు అయ్యారు. 2019 నాటికి వైసీపీలో చేరి పశ్చిమ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. సామాజిక సమీకరణ లో భాగంగా ఆయనకు వెంటనే మంత్రి పదవి కూడా దక్కింది. ఆ హోదాలో ఆయన ఫైర్ బ్రాండ్ గా ఏ విధంగా జోరు చేశారో అందరికీ తెలిసిందే.

ఫేటు మారిందిగా :

ఇక ఆయన మీద పశ్చిమలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది అన్న కారణంతో ఆయనను తెచ్చి విజయవాడ సెంట్రల్ నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేయించారు. నిజానికి అది మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సీటు. ఇక అక్కడ బలమైన నేతగా ఉన్న బోండా ఉమా కూటమి ప్రభంజనంలో గెలిచారు. వెల్లంపల్లి కి చుక్కెదురు అయింది. దీంతో వెల్లంపల్లి కూడా సెంట్రల్ సీటు వైపు చూడడం మానేశారు. తిరిగి అక్కడ పార్టీ యాక్టివిటీని మల్లాది విష్ణు చూస్తూ వస్తున్నారు. వెల్లంపల్లి విషయానికి వస్తే ఆయన విజయవాడ పశ్చిమంలోనే ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు.

క్యాడర్ తో కలిసి :

అక్కడే పర్యటనలు చేస్తూ క్యాడర్ తో కలసి ముందుకు సాగుతున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా చేయడంతో పాటు మంత్రిగా పనిచేసి ఉన్నందున తనకంటూ సొంత బలం పట్టు ఆయనకు అక్కడ ఉన్నాయి. దాంతో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వెల్లంపల్లి ప్రిపరేషన్ లో ఉన్నారని అంటున్నారు. ఈ మేరకు ఆయనకు జగన్ నుంచి ఏమైనా హామీ లభించిందా లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో సీటు మార్చిన వారిని అక్కడే ఇంచార్జిగా ఉంటూ పనిచేయమని అధినాయకత్వం చెప్పిందని అంటున్నారు చాలా చోట్ల అలా పనిచేయలేక అనేక మంది అయిష్టంగా ఉంటున్నారు. మరి వెల్లంపల్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలా మంది కూడా అడుగుతారు. హైకమాండ్ ఈ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు.

మాజీ జనసేన నేత :

ఇక ఇదే విజయవాడ పశ్చిమ సీటు మీద ఆశలు పెట్టుకుని జనసేన మాజీ నేత పోతిన మహేష్ ఉన్నారు. ఆయనకు 2024 ఎన్నికల వేళ చివరి నిముషంలో కూటమి హ్యాండ్ ఇవ్వడంతో ఆవేశంతో వైసీపీలో చేరారు. వైసీపీ అప్పటికే విజయవాడ పశ్చిమలో మైనారిటీ క్యాండిడేట్ ని ఫిక్స్ చేసింది. అలా ఆయన వైసీపీలో చేరి ప్రచారం చేశారు. ఆయనకు 2029లో పోటీకి అక్కడ నుంచి హామీ ఉందని అంటున్నారు. ఇపుడు వెల్లంపల్లి దూకుడుతో ఆయన వర్గం కలవరపడుతోంది అని అంటున్నారు. మరో వైపు ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్న ఈ సీట్లో వారు కూడా సీటు కోసం పట్టుబట్టే చాన్స్ ఉందని అంటున్నారు. వెల్లంపల్లి అయితే విజయవాడ పశ్చిమ తన సీటు అని గట్టిగానే తీర్మానించుకుని జనంలోకి వెళ్తున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News