కేసీఆర్‌ను తెలంగాణ ప్ర‌జ‌లు వ‌దిలించుకున్నారు: రేవంత్‌

''నేను కొట్టిన‌ట్టు న‌టిస్తా.. నువ్వు త‌న్నులు తిన్న‌ట్టు న‌టించు.. అన్న‌విధంగా కేసీఆర్‌-విజ‌య‌న్‌-మోడీలు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. ఈ ముగ్గురు మంచి మిత్రులు.;

Update: 2026-04-07 18:33 GMT

''నేను కొట్టిన‌ట్టు న‌టిస్తా.. నువ్వు త‌న్నులు తిన్న‌ట్టు న‌టించు.. అన్న‌విధంగా కేసీఆర్‌-విజ‌య‌న్‌-మోడీలు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. ఈ ముగ్గురు మంచి మిత్రులు. వీరిని న‌మ్మొద్దు. కేసీఆర్‌ను తెలంగాణ ప్ర‌జ‌లు వ‌దిలించుకున్నారు. మీరు(కేర‌ళ ప్ర‌జ‌లు) విజ‌య‌న్‌ను వ‌దిలించుకోండి. అప్పుడే కేర‌ళ అభివృద్ధి సాకారం అవుతుంది.'' అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున కేర‌ళ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్న రేవంత్ రెడ్డి.. తాజాగా మంగ‌ళ‌వారం ఉద‌యం కాంగ్రెస్ అభ్య‌ర్థుల త‌ర‌ఫున తిరువ‌నంత‌పురంలో ప‌ర్య‌టించారు. తొలుత రోడ్ షో నిర్వ‌హించిన ఆయ‌న‌.. అనంత‌రం.. కేర‌ళ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. కేర‌ళ ముఖ్య‌మంత్రి విజ‌య‌న్ స‌హా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీల‌పై విరుచుకుప‌డ్డారు. ఈ ముగ్గురు మిత్రుల‌ని.. వారు దొంగ మిత్రులా.. మంచి మిత్రులా.. అని తాను చెప్ప‌డం లేద‌న్నారు. కానీ, మోస‌కారి మిత్రుల‌ని రేవంత్ వ్యాఖ్యానించారు.

''ఒక‌రు తెలంగాణ‌ను దోచుకున్నారు. ప్ర‌జ‌లు త‌గిన విధంగా బుద్ధి చెప్పారు. మ‌రొక‌రు దేశాన్ని దోచుకుని.. త‌న వ్యాపార మిత్రుల‌కు దోచి పెడుతున్నారు. ఇంకొక‌రు.. కేర‌ళ‌ను దోచుకుంటున్నారు. వీరిని ఉపేక్షిస్తా రా?'' అంటూ.. రేవంత్ ప్ర‌శ్నించారు. సంక్షేమ రాజ్యం కావాలంటే.. తెలంగాణ ప్ర‌జ‌ల మాదిరిగా కేర‌ళ ప్ర‌జ‌లు కూడా పోటెత్తి.. కాంగ్రెస్‌కు ఓటేయాల‌ని.. త‌న‌దైన శైలిలో ప్ర‌సంగించారు. విజ‌య‌న్‌పై దొంగ‌త‌నం కేసులు ఉన్నాయ‌ని.. మోసం కేసులు కూడా ఉన్నాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అయితే.. విజ‌య‌న్‌.. త‌న మిత్రుడు మోడీ ద్వారా... దాప‌రికంగా ఉంచుతున్నార‌ని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిం చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విజ‌య‌న్ నేరాలు.. దోపిడీని నిగ్గుతేలుస్తామ‌న్నారు. కేర‌ళ ప్ర‌జ‌లు విద్యావంతులు.. విజ్ఞాన వంతులు.. మేధావులు అని ప్ర‌శంసించిన రేవంత్ రెడ్డి.. ఆలోచించి ఓటేయాల‌ని.. అభివృద్ధికి ప‌ట్టంక‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. ఈ ఎన్నిక‌లు కేర‌ళ ప్ర‌జ‌లు.. కేర‌ళ అభివృద్ధికి జ‌రుగుతున్న ఎన్నిక‌లుగా ఆయ‌న పేర్కొన్నారు.

కాగా.. ఈ నెల 23న కేర‌ళ‌లో ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఫ‌లితం మే 4న తెలియ‌నుంది. మొత్తం 140 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ పార్టీ యూడీఎఫ్ కూట‌మిగా ముందుకు సాగుతోంది. ఈ కూట‌మి గెలుపున‌కు అవ‌కాశం ఉంద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి.

Tags:    

Similar News