మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌న్న కేటీఆర్‌

Update: 2015-12-07 03:19 GMT
తెలంగాణ రాష్ర్ట ఐటీ - పంచాయ‌తీ రాజ్ శాఖా మంత్రి కే తార‌క‌రామారావు మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్నారు! ఈ మాట చెప్పింది ఎవ‌రో కాదు స్వ‌యంగా కేటీఆరే. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమారుడు, ప్ర‌భుత్వంలో కీల‌క స్థానంలో ఉన్న కేటీఆర్ ఇంత భారీ స్టేట్‌ మెంట్ ఎందుకు ఇచ్చాడు?  ప‌ద‌విని వ‌దుల‌కునే స్థాయికి దారితీసిన ప‌రిస్థితులు ఏంటి అంటూ ఆలోచించ‌కండి. ప‌ద‌విని వ‌దులుకుంటా అన్న‌ది నిజ‌మే కానీ అందులో ఓ కిటుకు ఉంది మ‌రి.

టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ స‌భ్యులు అయిన మంత్రి కేటీఆర్‌, ఆయ‌న‌ మేన‌బావ-మ‌రోమంత్రి హ‌రీశ్‌ రావుల మ‌ధ్య ప‌వ‌ర్ వార్ న‌డుస్తోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున‌ టాక్ ఉన్న సంగ‌తి తెలిసిందే. సంద‌ర్భానుసారంగా ఈ విష‌యంలో క్లారిటీ ఇస్తున్న‌ప్ప‌టికీ ఈ ప్ర‌శ్న మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు వారికి ఎదుర‌వుతూనే ఉంది. తాజాగా ఓ ఛాన‌ల్ మంత్రి కేటీఆర్ ఇంట‌ర్వ్యూ చేస్తూ ప‌నిలో ప‌నిగా ఈ ప్ర‌శ్న సంధించింది. కుటుంబ రాజ‌కీయాల్లో హ‌రీశ్‌ ను దాటుకొని వెళ్ల‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నారంటూ స‌ద‌రు విలేక‌రి ప్ర‌శ్నించగా కేటీఆర్ ఆస‌క్తిక‌రంగా స‌మాధాన‌మిచ్చారు. త‌మ కుటుంబంలో అలా ప‌ద‌వుల పోటీ ఏమీ లేద‌ని చెప్పారు. త‌మ పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్ వ‌ల్లే తాను మంత్రిని అయ్యాన‌ని పేర్కొంటూ ఇది త‌న‌కు ద‌క్కిన పెద్ద గౌర‌వంగా భావిస్తున్నాన‌ని చెప్పారు. ఇంత‌కంటే పెద్ద ప‌ద‌విని తానేమీ ఆశించ‌డం లేద‌ని, ఆ అవ‌స‌రం కూడా లేదని స్ప‌ష్టం చేశారు. త‌మ పార్టీ అధినేత అయిన కేసీఆర్‌ చెప్తే త‌న‌ మంత్రి ప‌ద‌విని కూడా వ‌దులుకునేందుకు సిద్ధ‌మ‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించేశారు.

ప‌నిలో ప‌నిగా రాష్ర్ట రాజ‌కీయాల గురించి కూడా కేటీఆర్ మాట్లాడారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో తాము మొత్తం 150 స్థానాల్లో ఒంట‌రిగానే పోటీచేస్తామ‌ని ప్ర‌క‌టించారు. త‌మ సొంత లెక్క‌ల ప్ర‌కార‌మే 75 స్థానాల్లో గెలుస్తామ‌ని స్ప‌ష్టం అవుతున్న‌పుడు ఎవ‌రితోనో జ‌ట్టుక‌ట్టాల్సిన అవ‌స‌రం త‌మ‌కేంట‌ని ఎదురు ప్ర‌శ్నించారు ఎంఐఎంతో పొత్తు కానీ అవ‌గాహ‌న కానీ ఉండ‌నే ఉండ‌ద‌ని స్ప‌ష్టంచేశారు. బ‌ల్దియా ఎన్నిక‌ల్లో నెగ్గి పీఠం అధిరోహిస్తామ‌ని...అంతేకాకుండా వ‌రంగ‌ల్‌, ఖమ్మం పురపాలిక‌ల్లోనూ గులాబీ జెండా ఎగుర‌వేస్తామ‌ని కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు.
Tags:    

Similar News