'టీఆర్ఎస్‌'ను వాడుకునే దిశ‌గా క‌విత‌!

టీఆర్ఎస్‌ (తెలంగాణ రాష్ట్ర‌స‌మితి).. ఒక‌ప్పుడు గ్రామ గ్రామాన నిన‌దించిన పేరు.. వినిపించిన పేరు.;

Update: 2026-04-03 18:40 GMT

టీఆర్ఎస్‌ (తెలంగాణ రాష్ట్ర‌స‌మితి).. ఒక‌ప్పుడు గ్రామ గ్రామాన నిన‌దించిన పేరు.. వినిపించిన పేరు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యం నుంచి తెలంగాణ ఆవిర్భావం వ‌ర‌కు.. కూడా టీఆర్ ఎస్ తెలంగాణ పల్లె నుంచి ప‌ట్నం వ‌ర‌కు ప్ర‌జ‌ల న‌రాల్లో జీర్ణించుకుపోయింది. పూర్తిస్థాయి పేరు ప‌ల‌క‌డం రాని వారు కూడా `టీఆర్ఎస్` జ‌పం చేసిన రోజులు ఇంకా గుర్తుండే ఉన్నాయి. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. అధికారంలోకి వ‌చ్చిన ఏడు సంవ‌త్స‌రాల వ‌ర‌కు టీఆర్ ఎస్ పార్టీనే ఉంది. ఆ త‌ర్వాత‌.. దానిని బీఆర్ ఎస్‌గా మార్పు చేశారు.

అయితే.. ఇప్పుడు ఈ `టీఆర్ ఎస్‌` పేరును వినియోగించుకునే దిశ‌గా కేసీఆర్ త‌న‌య‌, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత అడుగులు వేస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్ర‌స్తుతం టీఆర్ ఎస్ ఖాళీగా ఉంద‌ని.. దానిని ఎవ‌రూ వినియోగించుకోవ‌డం లేద‌ని.. దీనిని ఎవ‌రైనా వినియోగించుకునే సౌక‌ర్యం ఉంద‌ని క‌విత వ్యాఖ్యానించారు. దీనిని బ‌ట్టి.. ఆమెస్థాపించ బోయే కొత్త పార్టీకి ఈ పేరు పెట్టినా ఆశ్చ‌ర్యంలేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

వాస్త‌వానికి కొన్ని రోజుల కింద‌ట‌.. క‌విత‌.. త‌న పార్టీ పేరును తెలంగాణ `జాగృతి`గానే పేర్కొన్నారు. ఈ పేరునే కేంద్ర ఎన్నిక‌ల సంఘంలో న‌మోదు చేసేందుకు ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం కూడాఉంది. కానీ, ఇంత లోనే ఆమె త‌న‌దైన శైలిలో వ్యూహం మార్చిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ జాగృతి కంటే.. `టీఆర్ఎస్‌` పేరు ఇప్ప‌టికే ప్ర‌జ‌ల‌కు చేరువైన నేప‌థ్యంలో ప్ర‌జ‌ల నాలుక‌ల‌పై ఒక‌ప్పుడు పెద్ద ఎత్తున క‌ద‌లాడిన పేరు కూడా కావ‌డంతో ఆ పేరునే ఆమె ఓన్ చేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఈ విష‌యాన్ని న‌ర్మ‌గ‌ర్భంగా చెప్పుకొచ్చిన క‌విత‌.. ``పాత పేరు, కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తా`` అని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ పేరు ఫ్రీ అయిందని అన్నారు. ఈ పేరును ఇప్పుడు ఎవ‌రైనా వాడుకోవ‌చ్చ‌ని వ్యాఖ్యానించారు. అయితే.. తాను తీసుకుంటున్న‌ట్టుగా ఆమె స్ప‌ష్టం చేయ‌లేదు. ఇదిలావుంటే.. ఆచార్య జయశంకర్‌ సిద్ధాంతాల ప్రకారమే తమ పార్టీ నడుస్తుందని క‌విత వెల్ల‌డించారు. తాము ఏ బీహార్‌కు చెందిన వ్య‌క్తుల‌ స‌ల‌హాల‌ను తీసుకునేది లేద‌న్నారు. సో.. దీనిని బ‌ట్టి క‌విత పార్టీ `టీఆర్ ఎస్‌` అయ్యే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చకు తెర‌లేచింది.

Tags:    

Similar News