హైద‌రాబాద్‌ లో మ‌రో అంత‌ర్జాతీయ స‌ద‌స్సు..

Update: 2018-01-11 12:58 GMT
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. హైదరాబాద్ మహానగరం వేదికగా ప్రతిష్ఠాత్మక డబ్ల్యూసీఐటీ(వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్‌ ఫర్మేషన్ టెక్నాలజీ) సదస్సు జరగనుందని వెల్ల‌డించింది. ప్ర‌ముఖ ఐటీ కంపెనీల వేదిక అయిన నాస్కామ్ - డబ్ల్యూఐటీఎస్‌ ఏ ప్రతినిధులతో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నేడు సమావేశమయ్యారు. భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 19 నుంచి 21వ తేదీ వరకు ప్ర‌తిష్టాత్మ‌క వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్‌ ఫర్మేషన్ టెక్నాలజీని హైద‌రాబాద్ వేదిక‌గా నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

డబ్ల్యూసీఐటీ సదస్సు కోసం హైదరాబాద్‌ ను ఎంపిక చేయడం గర్వకారణమని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సదస్సుకు 2500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. కెనడా - యూఎస్‌ ఏ - మెక్సికో - బ్రెజిల్ - నైజీరియా - సౌతాఫ్రికా - తైవాన్ - ఆర్మేనియా తదితర దేశాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజర‌వుతార‌ని వివ‌రించారు. టెక్ సమ్మిట్‌ కు హైదరాబాద్‌ ను ఎంపిక చేసినందుకు నాస్కామ్‌ కు అదేవిధంగా డబ్ల్యూఐటీఎస్‌ ఏకు కృతజ్ఞతలు తెలిపారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌ కు అంతర్జాతీయంగా ప్రముఖస్థానం ఉందని చెప్పారు. సదస్సుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు.. డబ్ల్యూసీఐటీ సదస్సుకు ప్రధానిని ఆహ్వానిస్తామని తెలిపారు.

డబ్ల్యూసీఐటీని హైదరాబాద్‌ లో నిర్వహిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి నాస్కామ్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నాస్కామ్ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్ తెలిపారు. డబ్ల్యూసీఐటీ సదస్సు ఐటీలో ఒలింపిక్స్ లాంటిదన్నారు. డబ్ల్యూసీఐటీతో పాటు నాస్కామ్ లీడర్‌ షిప్ అవార్డు కూడా నిర్వహిస్తమని ఆయన వెల్లడించారు. విస్సా ఛైర్‌ పర్సన్ ఇవాంగ్ ఛూ స్పందిస్తూ.. డబ్ల్యూసీఐటీ సదస్సుకు హైదరాబాద్ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. వరల్డ్ కాంగ్రెస్ ఐటీ సదస్సు వేదికగా ప్రపంచంలోని ప్రముఖ ఐటీ నిపుణులను - ప్రముఖ లీడర్లను ఒకే చోట చేరుస్తున్నమన్నారు.
Tags:    

Similar News