చెల్లెలు అలా అంటే.. అన్న ఇలా అన్నాడే

Update: 2016-02-07 04:25 GMT
తెలంగాణ అధికారపక్షంలో ఎంతోకాలంగా సాగుతున్న ఒక అంశానికి సంబంధించిన ప్రస్తావనను ఒకేరోజు టీఆర్ఎస్ పార్టీ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించటం విశేషం. టీఆర్ ఎస్ లో కేసీఆర్ తర్వాత ఎవరన్న మాటకు సూటిగా ఇప్పటివరకూ స్పందించింది లేదు. గ్రేటర్ లో అద్భుత విజయం సాధించిన తర్వాతి రోజే ఈ అంశానికి సంబంధించి కేసీఆర్ కుమార్తె కవిత ఒకలా స్పందిస్తే.. మంత్రి కేటీఆర్ మరోలా స్పందించటం గమనార్హం.

ఒకేరోజు ఒకే అంశం మీద కేసీఆర్ కూతురు.. కొడుకు చెప్పిన మాటలు ఆసక్తికరంగా ఉండటమేకాదు.. ఈ అంశంపై మరింత చర్చకు అవకాశం ఇచ్చేలా చేస్తున్నాయని చెప్పక తప్పదు. తండ్రి రాజకీయాలకు కొడుకే వారసుడన్న మాటను తేల్చేసిన కవితక్క.. ఆ మాట చెప్పేసి.. అయినా నాన్న నడిపిస్తున్న సమయంలో ఈ చర్చేంటంటూ నర్మగర్భంగా మాట్లాడేయటం గమనార్హం.ఒకవిధంగా చూస్తే.. తన అన్నే తన తండ్రి రాజకీయాలకు వారసుడన్న విషయాన్ని కవిత తేల్చేస్తే.. అందుకు భిన్నంగా కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మాత్రం ఆచితూచి రియాక్ట్ అయ్యారు. ఏమైనా కేటీఆర్.. కవిత మాటలు ఆసక్తిని రేపేవని చెప్పక తప్పదు.

ఇక.. ఈ ఇద్దరూ కేసీఆర్ తర్వాత ఎవరన్నమాటకు ఎలా స్పందించారన్నది వారి మాటల్లోనే చూస్తే..

‘‘మంత్రి కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో తనను తాను నిరూపించుకున్నారు. రాత్రీ పగలూ శ్రమించారు. టీఆర్ ఎస్ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. వారితో మమేకమై విజయానికి బాటలు వేశారు. ఇంత బాగా పని చేసిన కేటీఆర్ పార్టీ నాయకత్వానికి వారసుడవుతాడని నేను భావిస్తున్నాను. ఆయినా సమర్థుడు.. మా అందరికి దైవ సమానమైన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పని చేస్తున్న సమయంలో నాయకత్వంపై ఈ చర్చే అవసరం లేదన్నది మా అభిప్రాయం’’ -కేసీఆర్ కుమార్తె.. ఎంపీ కవిత

‘‘నేను గతంలో.. ఇప్పుడూ మంత్రిగానే ఉన్నా. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తా. కేసీఆర్ రాజకీయ వారసత్వంపై ఇప్పుడు చర్చ అనవసరం. ఆయనకు ఇప్పుడు 62 ఏళ్లు ఉన్నాయి. రాజకీయాల్లో ఇది పెద్ద వయస్సేమీ కాదు. మరో 20 ఏళ్ల పాటు ఆయనే బాధ్యతలు నిర్వహిస్తారన్న నమ్మకం నాలో.. ప్రజల్లోనూ ఉంది. అందువల్లఈ విషయంపై చర్చ అనవసరం’’ – కేసీఆర్ కుమారుడు.. మంత్రి కేటీఆర్
Tags:    

Similar News