ఆదిరిపోనున్న కేటీఆర్ ఐటీ పాలసీ

Update: 2016-04-03 04:54 GMT
ప్రభుత్వం ఏదైనా ఒక పాలసీని ప్రకటిస్తోందంటే.. పరిపాలనలో భాగమన్నట్లుగా భావిస్తారు. కానీ.. ప్రభుత్వం ఒక పాలసీని ప్రకటించే అంశంపై హైప్ క్రియేట్ కావటం కాస్త ఆసక్తికరం. అలాంటి పరిస్థితే తాజాగా చోటు చేసుకుంది. సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్న తెలంగాణ ఐటీ పాలసీపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే హైదరాబాద్ అంటే ఐటీ అన్న పేరున్న నేపథ్యంలో.. ఆ రంగాన్ని రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్లేలా చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు.. ఐటీ మంత్రి కేటీఆర్ ఎంతో శ్రమకోర్చి.. కలలాంటి పాలసీని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరో రోజులో బయటకు రానున్న ఈ ఐటీ పాలసీకి సంబంధించి బయటకు వచ్చిన కొన్ని సంగతులు విపరీతమైన ఆసక్తిని రేపుతున్నాయి.
తెలంగాణ ఐటీ పాలసీతో దేశీయంగానే కాదు.. అంతర్జాతీయంగా ఐటీ కంపెనీలు హైదరాబాద్ మీద కన్ను పడేలా చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

కేటీఆర్ సిద్ధం చేసిన ఐటీ పాలసీని ఆరు విభాగాలుగా చేసినట్లుచెబుతున్నారు. ఐటీ కంపెనీని సమగ్రంగా ఒక గూటిలోకి తీసుకురావటమే కాదు.. చిన్నా.. మధ్య.. పెద్ద వర్గాలతో పాటు.. ఇప్పటివరకూ పరిగణలోకి తీసుకోని వర్గాల్ని సైతం ఆకర్షించేలా తాజా ఐటీ పాలసీ ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజా ఐటీ పాలసీ హైదరాబాద్  ఇమేజ్ ను రెట్టింపు చేయటమే కాదు.. ఐటీ కంపెనీల మొదటి ప్రయారిటీగా హైదరాబాద్ ను నిలిచేలా చేయటం పక్కా అంటున్నారు.

కేటీఆర్ రూపొందించిన ఐటీ పాలసీలోని కీలక అంశాల్లో ఒకటి.. ఐటీ కంపెనీలను ఆరు విభాగాలుగా వర్గీకరించటం. ఈ ఆరు విభాగాలకు భారీ ప్రోత్సాహకాలు ఇవ్వటమేకాదు.. తెలంగాణలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి అవకాశాలు ఇచ్చేలా కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వటమే కాదు.. అలా చేస్తే.. కంపెనీలకు కలిగే ప్రయోజనాలు టెంప్టింగ్ గా ఉండటం గమనార్హం.

ఇక.. ఐటీ పాలసీలోని ఆరు విభాగాలు చూస్తే..

1.        మెగా కంపెనీలు

2.        ఐటీ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కంపెనీలు

3.        ద్వితీయ శ్రేణి నగరాల్లో నెలకొల్పే ఐటీ కంపెనీలు

4.        ఇంజనీరింగ్ సేవలు అందించే కంపెనీలు

5.        మధ్య తరహా – చిన్న – సూక్ష్మ తరహా కంపెనీలు

6.        మహిళలు – ఎస్సీ.. ఎస్టీ పారిశ్రామికవేత్తలు స్టార్ట్ చేసే కంపెనీలు

వర్గీకరణ ఇలా ఉంటే.. ఈ విభాగాల్లో ఉండే కంపెనీలు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు.. ప్రోత్సాహకాలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. ఐటీ కంపెనీల దృష్టిని ఆకర్షించేలా ఉందని చెప్పొచ్చు. ఆరు విభాగాల్లో అన్ని కంపెనీలకు కామన్ గా ఉండే రాయితీలు చూస్తే..

= అర్హతలకు తగ్గట్లుగా ఐటీ కంపెనీలకు కనీస ధర.. అభివృద్ధి ఛార్జీలతో ప్రభుత్వ భూముల కేటాయింపు

= విద్యుత్ ఛార్జీల్లో రాయితీలు

= మొదటి రిజిస్ట్రేషన్ కు వందశాతం.. రెండో రిజిస్ట్రేషన్ కు 50 శాతం స్టాంప్ డ్యూటీ.. బదిలీ సుంకం

= రిజిస్ట్రేషన్ ఫీజు రీయింబర్స్ మెంట్ (మెగా కంపెనీలకు ఉండదు)

= కాపీరైట్ ఫీజును గరిష్ఠంగా రూ.5లక్షలకు మించకుండా రీయింబర్స్ చేయటం

= కెపాబులిటీ మెచ్చూరిటీ మోడల్ ఫోర్ మించిన కంపెనీలకు నాణ్యత ధ్రువీకరణ చెల్లింపుల్లో రూ.4 లక్షలకు మించని రీయింబర్స్ మెంట్

 = విద్యుత్ ఛార్జీలు యూనిట్ కు రూపాయి చొప్పున రాయితీ (మెగా ప్రాజెక్టులకు ఇవ్వరు)
అన్ని కంపెనీలకు ఇచ్చే రాయితీలు ఈ రేంజ్ లో ఉంటే.. ఇక విభాగాల వారీగా ఎవరికి వారికి ఇచ్చే రాయితీలు.. ప్రోత్సాహకాలు మరిన్ని ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. కేటీఆర్ ఐటీ పాలసీ చూస్తే అనిపించేది ఒక్కటే.. తెలంగాణ ప్రాంతంలో ఐటీ కంపెనీ పెట్టాలన్న భావన కలిగించేలా ఉండటంతో కేటీఆర్ సక్సెస్ అయినట్లుగా చెబుతున్నారు. తన పాలసీలో ఆరు విభాగాలుగా చేసిన కంపెనీలకు ఇచ్చే తోఫాల్ని చూస్తే..

మెగా కంపెనీలకు..

మెగా కంపెనీలకు విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు లైసెన్స్ . వంద కిలోవాట్లకు మించిన సోలార్ పవర్ యూనిట్ నిర్మిస్తే రూ.20 లక్షల వరకు ప్రభుత్వం సాయంగా ఇవ్వటం. తెలంగాణ కాలేజీలకు చెందిన విద్యార్థుల్ని కంపెనీల్లో రిక్రూట్ చేసుకుంటే ఒక్కో ఉద్యోగి మీద రిక్రూట్ మెంట్ అసిస్టెన్స్ రూపంలో నగదును ఇస్తారు.

రీసెర్చ్ కంపెనీలకు..

పరిశోధనలు.. అభివృద్ధి కోసం పెట్టే ఖర్చులో 10 శాతాన్ని కంపెనీలకు గ్రాంట్ గా ఇస్తారు. పీహెచ్ డీ విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రోత్సాహం అందిస్తారు. ప్రతిభ ఆధారంగా టాప్ లో ఉన్న 25 శాతం విద్యార్థులకు ప్రతి నెలా రూ.25 వేలు స్టైఫండ్ చొప్పున రెండేళ్లు ఇచ్చారు. ప్రతి ఏటా 20 మంది విద్యార్థుల్ని కాలేజీల నుంచి రిక్రూట్ చేసుకుంటే రూ.20వేల చొప్పున నియామక సాయం అందజేస్తారు.

ద్వితీయ శ్రేణి నగరాల కంపెనీలకు..

ద్వితీయ శ్రేణి నగరాల్లో కంపెనీలు పెట్టే తొలి ఐదు కంపెనీలకు మొదటి మూడేళ్లు మన్సిపల్ ట్యాక్స్ ను రీయింబర్స్ చేస్తారు. ఏటా 50 మంది విద్యార్థుల్ని రిక్రూట్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.20వేల చొప్పున నియామక సాయం ఇస్తారు. బీపీవో కంపెనీలు ఏర్పాటు చేస్తే గరిష్ఠంగా రూ.20 లక్షలకు మించి పెట్టుబడి రాయితీ లభిస్తుంది. అభ్యర్థులకు ఇవ్వాల్సిన ట్రైనింగ్ అసిస్టెన్స్ ను ప్రభుత్వం అందిస్తుంది. ఒక్కొక్కరికి రూ.2500 చొప్పున మూడు నెలల పాటు ఇస్తుంది.

చిన్న కంపెనీలకు..

ఎగ్జిబిషన్ స్టాల్స్ లో అద్దె రాయితీ. ఏటా కాలేజీల నుంచి వంద మందిని రిక్రూట్ చేసుకుంటే రూ.20వేల చొప్పున నియామక సాయం. రూ.5లక్షల వరకు వార్షిక సాయం. అద్దెలో 25 శాతం సబ్సిడీ. రూ.10 కోట్లకు పైనే విలువ ఉన్న ప్రభుత్వ ప్రాజెక్టులలో 20 శాతం చిన్న.. సూక్ష్మ కంపెనీలకు ఇస్తారు.

ఆ వర్గాల కంపెనీలకు..

మహిళలు.. ఎస్సీ.. ఎస్టీ పెట్టుబడిదారుల్ని ప్రోత్సహించేందుకు వడ్డీ రాయితీ. విద్యుత్ ఛార్జీల్లో యూనిట్ కు రూ.1.50చొప్పున రీయింబర్స్ చేయటం. మహిళలకు గరిష్ఠంగా రూ.20లక్షలు.. ఎస్సీ.. ఎస్టీలకు గరిష్ఠంగా రూ.25లక్షలకు మించకుండా సబ్సిడీ. ఎగ్జిబిషన్ స్టాల్స్ లో భారీ రీయింబర్స్ మెంట్. ఏడాదికి 50 మంది తక్కువ కాకుండా రిక్రూట్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున రిక్రూట్ మెంట్ మొత్తాన్ని అందజేయటం.
Tags:    

Similar News