టీఆర్ ఎస్‌ లో కేటీఆర్ మాట సాగడం లేదంట‌

Update: 2015-12-08 17:42 GMT
తెలంగాణ రాష్ర్టంలో అధికార పార్టీ అయిన టీఆర్ ఎస్‌ లో కొత్త ఎపిసోడ్‌ కు తెర‌లేచింది. ఇప్ప‌టికే టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ స‌భ్యులైన ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్‌ - కూతురు క‌విత‌ - మేన‌ల్లుడు హ‌రీశ్‌ రావుల మ‌ధ్య కోల్డ్‌ వార్ న‌డుస్తుంటే...తాజా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు మ‌రో కొత్త కోణాన్ని తెర‌మీద‌కు తెచ్చాయ‌ని చెప్తున్నారు. ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపికే దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు చెప్తున్నాయి.

తెలంగాణ‌లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. 12 స్థానాల‌కు జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీ త‌న అభ్య‌ర్థుల‌ను మూడు ద‌ఫాలుగా ప్ర‌క‌టించింది. ఇందులో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ప్ర‌ధాన అనుచ‌రుడికి చిట్ట‌చివ‌రి జాబితాలో చోటుద‌క్క‌డం! రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా  ఎమ్మెల్యేగా బ‌రిలో నిలిచిన శంభీపూర్ రాజు మంత్రి కేటీఆర్‌ కు ప్ర‌ధాన అనుచ‌రుడు. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టికీ కేటీఆర్ వెంటే న‌డుస్తూ ఉన్నాడు. రంగారెడ్డిలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానం రాజుకు ఖాయ‌మ‌ని టీఆర్ఎస్ శ్రేణులు కూడా భావించాయి.

కానీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు జాబితాలో రాజుకు తీవ్ర నిరీక్ష‌ణ త‌ప్ప‌లేదు. మొద‌టి విడ‌త‌. అనంత‌రం రెండో విడ‌త ఆ త‌ర్వాత మూడో విడ‌త వ‌ర‌కు రాజు వెయిటింగ్‌లోనే ఉండాల్సి వ‌చ్చింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్ర‌క‌టించిన మూడో జాబితాలో రాజు పేరు ఉంది. ఈ ప్ర‌క‌ట‌న టీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. కేటీఆర్‌ కు ప్ర‌ధాన అనుచ‌రుడు అయిన రాజుకు ఎమ్మెల్సీ అభ్య‌ర్థిత్వం ద‌క్కడానికే తుది జాబితా వ‌ర‌కు వెయిటింగ్ ఉందంటే పార్టీలో బాస్‌ను త‌ప్ప మ‌రెవ‌రినీ ప్ర‌స‌న్నం చేసుకున్నా ప‌నులు కావేమోన‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News