కేటీఆర్ చేనేత ‘షో’ మొదలైందోచ్..

Update: 2017-01-03 16:15 GMT
ఎప్పుడేం చేస్తే ప్రచారం వస్తుందో.. మైలేజీ పెరుగుతుందో బాగా తెలుసు. అలాంటి రాజకీయ నేతల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు.. మంత్రి కేటీఆర్ ఒకరు. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా ప్రమోట్ చేయటంలో సక్సెస్ అయినట్లుగా ప్రచారం పొందటంలో ఆయన సూపర్ డూపర్ హిట్ కొట్టారనే చెప్పాలి. విపక్షాలు సైతం.. ఐటీలో అభివృద్ధి చెందితే సరిపోతుందా? అంటూ విమర్శలు చేసే వరకూ విషయం వెళ్లిందంటే.. కేటీఆర్ పని తీరును మెచ్చుకోవాల్సిందే. మరింత ‘విషయం’ ఉన్న కేటీఆర్.. హైదరాబాద్ రోడ్లను ఒక లెక్కకు తీసుకురావటానికి నెలల తరబడి టైం ఎందుకు తీసుకున్నారన్న ధర్మసందేహాన్ని సంధిస్తే మాత్రం సమాధానం లభించని పరిస్థితి.

నాలుగు రోజులు లేటైనా.. అదిరిపోయేలా రోడ్లు వేస్తామని.. ఒక్కసారి రోడ్లు కానీ వేస్తే.. నాలుగైదు సంవత్సరాల వరకూ తిరుగు ఉండదన్నట్లుగా మాటలు చెప్పిన కేటీఆర్ మాటలకు భిన్నంగా.. హైదరాబాద్ గుంతల రోడ్ల మీద సాగుతున్న ట్యాపింగ్ పనులు చూస్తే.. ఉమ్మడి రాష్ట్రంలో అందరూ తిట్టిపోసే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే జరిగిన రోడ్లు పనులే వేగంగా.. నాణ్యంగా జరిగినట్లు చెబుతున్నారు.

రోడ్ల విషయంలో అడ్డదిడ్డంగా ఫెయిల్ అయినప్పటికీ.. ఐటీని ప్రమోట్ చేసే విషయంలో మాత్రం కేటీఆర్ కు తిరుగులేదన్న మాటను సొంతం చేసుకున్నారు. ఇప్పుడాయన దృష్టి చేనేత వస్త్రాల మీద పడింది. మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్నా.. ప్రతి సోమవారం మాత్రం చేనేతకు చేయూత ఇచ్చేలా చేనేత వస్త్రాల్ని ధరించాలంటూ సరికొత్త ప్రచారాన్ని షురూ చేశారు.

ఇలాంటి ప్రచారానికి ఎంతటి హైప్ తీసుకురావొచ్చు.. ఎలా తీసుకురావచ్చన్న విషయంలో కేటీఆర్ కున్న తెలివే తెలివని చెప్పక తప్పదు. అందుకే.. ఆయన తన సెలబ్రిటీ ఫ్రెండ్స్ ను సీన్లోకి తీసుకొచ్చారు. సినీ నటులు కమల్ హాసన్.. మహేశ్ బాబు.. నాగార్జున.. రానా.. వివేక్ ఒబెరాయ్.. సమంత.. మంచు లక్ష్మి..సానియా మీర్జా.. పీవీ సింధు.. జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ లాంటోళ్లను ట్విట్టర్ లో ట్యాగ్ చేసేశారు. సోషల్ మీడియాలో కాస్త హుషారుగా.. స్పీడ్ గా ఉన్న వాళ్లను.. అది కూడా అన్ని రంగాలు కవర్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్న కేటీఆర్ చేనేత ప్రచారం మరింత ముమ్మరంగా సాగటం ఖాయమని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి కుమారుడు.. తెలంగాణ రాష్ట్రంలో పవర్ ఫుల్ పెద్దమనుషుల్లో ముఖ్యుడైన వ్యక్తి తమను ట్యాగ్ చేస్తే.. సెలబ్రిటీలు మాత్రం స్పందించకుండా ఉంటారా? సో.. కేటీఆర్ చేనేత ప్రచారం మూడు ట్వీటులు.. ఆరు రీట్వీట్ లు కావటం ఖాయమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News