రాఘవ్ చడ్డా నోట తాజా మాట.. ‘ఘాయల్ హూన్, ఇస్లియే ఘాతక్ హూన్’
కొన్నిసందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవటం ఎంత ఆలస్యమైతే అంత మంచిది. అందునా.. ముక్కుతూ.. మూలుగుతూ ఉండే పరిస్థితుల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవటం అంత మంచిది కాదు.;
కొన్నిసందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవటం ఎంత ఆలస్యమైతే అంత మంచిది. అందునా.. ముక్కుతూ.. మూలుగుతూ ఉండే పరిస్థితుల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవటం అంత మంచిది కాదు. దీనికి తోడు క్లీన్ చిట్ ఉండే ప్రజానాయకుడి మీదా.. ప్రజల్లో కొత్త తరం నాయకుడిగా పేరుప్రఖ్యాతుల్ని సొంతం చేసుకుంటున్న నేత మీద చర్యలు తీసుకోవటం సాహసోపేతమైన నిర్ణయం. నిజానికి అలాంటి నిర్ణయంతో పార్టీకి జరిగే డ్యామేజ్ భారీగా ఉంటుంది.
అయితే.. ఇవేమీ పట్టించుకోనట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్న నిర్ణయం.. ఆ తర్వాత వ్యవహరిస్తున్న వైనం కొత్త సంచలనాలకు తెర తీయటమే కాదు.. పార్టీకి షాకుల మీద షాకులు ఇస్తున్న పరిస్థితి. నిత్యం సామాన్యులు ఎదుర్కొనే సమస్యల మీద రాజ్యసభలో సూటిగా ప్రశ్నిస్తూ.. అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టే యువతరం నేత.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చడ్డాను రాజ్యసభలో పార్టీ ఉప నాయకుడి హోదా నుంచి తొలగిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. ఆయన స్థానంలో పార్టీకి చెందిన మరో ఎంపీ అశోక్ మిత్తల్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దీనిపై గడిచిన మూడు రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తనపై వస్తున్న విమర్శలకు రాఘవ్ చడ్డా ఎప్పటికప్పుడు తనదైన శైలిలో సమాధానాలు చెబుతున్నారు. ఆయన్ను పార్టీ పదవి నుంచి తప్పిస్తూ తీసుకున్ననిర్ణయాన్ని తప్పుపడుతూ.. రాష్ట్రాలకు అతీతంగా దేశ వ్యాప్తంగా ఆయనకు దన్నుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టుల వరద కురుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజు (శనివారం) పంజాబ్ ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు రాఘవ్ చడ్డా ఇష్యూను మరోస్థాయికి తీసుకెళ్లేలా చేశాయి.
శనివారం మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో చండీగఢ్ లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రాఘవ్ ఉదంతంపై స్పందించారు. ఆయన మాటల్లో చడ్డాను కాంప్రమైజ్డ్ అన్న మాటను ఉపయోగించారు. ఈ పదానికి అర్థం లొంగిపోయారు లేదంటే అమ్ముడుపోయినట్లుగా పేర్కొనటంతో పాటు.. పార్టీ లైన్ దాటి వెళ్లే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ పార్టీకి చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు మూడు గంటల అనంతరం అంటే.. శనివారం సాయంత్రం4.30గంటల పరాంతంలో రాఘవ్ చడ్డా తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను పోస్టు చేశారు.
ధురంధర్ మూవీలోని ఫేమస్ డైలాగ్.. ‘‘ఘాయల్ హూన్, ఇస్లియే ఘాతక్ హూన్" (గాయపడ్డాను.. అందుకే మరింత దృఢంగా మారాను) ను క్యాప్షన్ గా పోస్టు చేసి..తనపై వస్తున్న ఆరోపణలను స్క్రిప్టెడ్ క్యాంపెయిన్ గా కొట్టిపారేశారు. అంతేకాదు.. తనపై వస్తున్న ఆరోపణలకు వరుస క్రమంలో కౌంటర్లు ఇవ్వటం సంచలనంగా మారింది. అందులో మొదటిది విపక్షాలు వాకౌట్ చేసినప్పుడు తాను సీట్లోనే కూర్చున్నానన్నది పచ్చి అబద్ధంగా పేర్కొంటూ.. పార్లమెంటులోని సీసీ టీవీ కెమెరాలను తనిఖీ చేయొచ్చని సవాల్ విసిరారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అభిశంసన తీర్మానం కోసం తనను ఎవరూ సంతకం అడగలేదని.. తనతో పాటు పార్టీలోని మరో ఆరేడుగురు ఎంపీలు కూడా సంతకం చేయలేదని.. తనను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?అని ప్రశ్నించారు,
తాను పార్లమెంట్ కు వెళ్లింది.. మైకులు విరగ్గొట్టడానికి కాదని.. జీఎస్టీ.. రైల్వే ధరలు.. గిగ్ వర్కర్ల సమస్యల గురించి మాట్లాడేందుకేనని ఆయన స్పష్టం చేయటమే కాదు.. ప్రజా సమస్యలను లేవనెత్తటమే నేరమా? అంటూ నిలదీసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన పోస్టు చేసిన గంట వ్యవధిలోనే పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అంతేకాదు.. ఎక్స్ లో #RaghavChadha అనే హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలో ట్రెండింగ్ లో ఉండటం గమనార్హం. ఆయన పెట్టిన పోస్టుకు ఆయన సతీమణి పరిణీతి చోప్రా రీషేర్ చేస్తూ.. నిజం ఎప్పుడూ గెలుస్తుందనే అర్థం వచ్చేలా మద్దతు ఇవ్వటం ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. కొత్త చర్చకు తెర తీసిందని చెప్పాలి.