‘మహా’ విషాదం: బావిలోకి దూసుకెళ్లిన కారు.. తొమ్మిది మంది దుర్మరణం
ఘోర విషాదం ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఒక రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.;
ఘోర విషాదం ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఒక రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఈ ఘోరం చోటు చేసుకుంది. వీరంతా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి.. ప్రమాదవశాత్తు బావిలోకి దూసుకెళ్లటం.. బావిలో నీళ్లు.. లోతుగా ఉండటంతో వీరు బయటకు రాలేక ప్రాణాలు పోయిన దుస్థితి. దీనికి తోడు ఈ ప్రమాదం రాత్రి వేళలో చోటు చేసుకోవటం కూడా ఒక కారణంగా చెప్పాలి.
ఈ విషాద ఉదంతం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెండు క్రేన్లు.. గజ ఈతగాళ్ల సాయంతో కారుతో పాటు డెడ్ బాడీస్ ను బావి నుంచి బయటకు తీశారు. ఈ ఉదంతంలో సునీల్ దత్తు దర్గుడే (32), ఆయన భార్య రేషా.. మరో కుటుంబ సభ్యురాలు ఆశా అనిల్ దర్గుడేతో పాటు.. వీరికి చెందిన ఆరుగురు పిల్లలు దుర్మరణం పాలయ్యారు.
నాసిక్ జిల్లాలోని చంద్వాడ్ ప్రాంతం వద్ద ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న మారుతి సుజుకి ఎర్టిగా/ఎక్స్ ఎల్ 6లో ఏదో ఒకటిగా చెబుతున్నారు. శుక్రవారం రాత్రి 10.30-11.30గంటల ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కనే పంట పొలంలోఉన్న లోతైన బావిలో కారు పడిపోవటం.. 20 అడుగుల మేరనీరుఉండటంతో వీరు బయటకు రాలేని పరిస్థితి. పోలీసులు సైతం భారీ క్రేన్లు తెప్పించి.. కారును బయటకు తీయాల్సి వచ్చింది. ఈ దారి నుంచి కొత్తవారు రాత్రి వేళ వెళ్లేటప్పుడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు.
రోడ్డు ముగిసే ప్రాంతంలో బావి ఉండటం.. దానికి చుట్టూ రక్షణ గోడ లేకపోవటంపై అధికారులు విచారణకు ఆదేశించారు. బావి యజమానిపైనా కేసు నమోదు చేశారు. గత ఏడాది జులైలోనూ ఇదే ప్రాంతంలో మరో చోట కారు ఒక నీటి కాలువలోకి దూసుకెళ్లి.. ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. పొలాల్లో ఉండే బావులకు రక్షణ గోడలు తప్పనిసరి. అదే సమయంలో.. పబ్లిక్ రోడ్ కు దగ్గరగా ఉండే ఇలాంటి వాటి వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయటం తప్పనిసరి. ఈ విషయంలో అధికారుల లోపం కూడా కనిపిస్తుంది.
ఇలాంటి దారుణ విషాదాలు చోటు చేసుకున్నప్పుడు తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవటమే తప్పించి..ఈ తరహా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వీలుగా శాశ్విత పరిష్కారాలు చూపించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వాల వైఫల్యం కొట్టొచ్చినట్లుగా ఉందని చెప్పక తప్పదు. ఈ ఘోర ప్రమాదం అనంతరం ఈ బావి చుట్టూ రక్షణ గోడను కడుతుండటం గమనార్హం. ఒక రక్షణ గోడ కట్టాలంటే తొమ్మిది ప్రాణాలు పోవాలా?